ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అతి కొద్ది వేతనంతో కుటుంబాలను పోషించుకోలేక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వండి వడ్డిస్తున్నప్పటికీ ఏళ్లు తరబడి కనీస వేతనాలు అందడం లేదు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిడ్డే మీల్స్ వర్కర్ల సమస్యల పట్ల చంద్రబాబు తీరును తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు అదే రీతిన వ్యవహరిస్తున్నారు. కేవలం రూ.3 వేల వేతనంతో కాలం వెళ్ళదీస్తున్న వీరంతా కుటుంబాలను పోషించుకోవడానికి అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
కాకినాడ జిల్లాలో 1,250 పాఠశాలల్లో 1,46,849 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రైమరీ విద్యార్థులు 42960 మంది, యుపి విద్యార్థులు 12,403, హైస్కూలు విద్యార్థులు 91,486 మంది ఉన్నారు. వీరిలో 1,03,138 మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 3,500 మంది కార్మికులున్నారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం, వారిని ఆకలి బాధ నుంచి దూరం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్యను పెంచే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యాహ్న భోజన పథకాన్ని వీరంతా సమర్థవంతంగా అమలు జరిగేలా కృషి చేస్తున్నారు.
హామీ అమలేది..?
ఎన్నికలకు ముందు వైఎస్.జగన్ నిర్వహించిన పాదయాత్రలో మధ్యాహ్న భోజన పథక కార్మికులకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా నేటికీ హామీ అమలు జరగలేదు. రూ.వెయ్యి మాత్రమే ఉన్న వేతనాన్ని రూ.3 వేలకు పెంచినా.. అదీ అనేకమంది కార్మికులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. తొండంగి మండలం బెండపూడి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషన్ ట్రస్ట్ పని చేస్తోంది. కత్తిపూడి, చిత్రాడ క్లస్టర్ల పరిధిలో తుని, తొండంగి, రౌతులపూడి, శంఖవరం, గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలున్నాయి. వీటి పరిధిలో పని చేస్తున్న సుమారు 2 వేల మంది వర్కర్లకు కేవలం రూ.1500 మాత్రమే వేతనంగా అందజేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేలు ఇవ్వాల్సి ఉన్నా ఏజెన్సీలు ఉన్నచోట సగం జీతం మాత్రమే వస్తుండడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో రూ.3000 గౌరవ వేతనం అందిస్తున్నా ఇక్కడ మాత్రం ఇవ్వకపోవడం శోచనీయమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు ధర్నాలు చేసి అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడంలేదని మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. వాస్తవానికి స్కీము వర్కర్లకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని చట్టం చెబుతున్నా ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటూ అరకొర జీతాలే ఇస్తోంది. ఇప్పటికైనా స్పందించి కనీసంగానైనా రూ.10 వేలు ఇచ్చి జగన్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని కార్మికులంతా కోరుతున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం వంట పాత్రలు ఇచ్చి చేతులు దులుపుకున్న సర్కారు ఆ తర్వాత నుంచి ఇవ్వడం మానేసింది.కార్మికులే సొంతంగా కొనుగోలు చేసుకుని వండి వడ్డిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే వంట పాత్రలు కూడా ఇవ్వాలని, గ్యాస్ సరఫరా చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. పిల్లలకు రూ.20 వరకూ మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.










