ప్రజాశక్తి-ఉక్కునగరం : ఎన్‌జెసిఎస్‌లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఉక్కు ఇడి వర్క్స్ బిల్డింగ్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల బేసిక్ మీద వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉక్కు ఉత్పత్తిలో కీలక స్థానం వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు గౌరవప్రదమైన వేతనాలు పెంచకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో యాజమాన్యం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎక్స్‌గ్రేషియా రూ.11 లక్షలు చేస్తూ సిఎమ్‌డి సంతకం చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ వేతనాల పెంపు అమలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం హెచ్‌ఆర్ జిఎంకు వినతిపత్రం అందజేశారు. స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ఒవి.రావు, జి.శ్రీనివాసరావు, బి.కన్నబాబు, మురళీకృష్ణ, కె.అవతారం, బొడ్డ గోవిందు, పిట్టా రెడ్డి, కోన రమణ మాట్లాడారు. అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.










