ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్ మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని గన్నేవారిపల్లి పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కడప రోడ్డులోని రామాలయం వద్ద రూరల్ పరిధిలోని గన్నేవారిపల్లి పంచాయతీ కార్మికుకులు మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోవడంతో పండగపూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇప్పటికే అప్పులు తెచ్చి కుటుంబాలు పోషించుకుంటున్నామని, ఇక అప్పులు కూడా పుట్టని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జీతాలు ఇవ్వాలని అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా తమపై దయ ఉంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించడంతోపాటు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు రాజు, సంధ్యాభాయి, రామకృష్ణ, అచ్చమ్మబాయి, కుళ్లాయప్ప, ఓబయ్య, భాస్కర, జిజె.బాయి, కుళ్లాయమ్మ, రాణి, తదితరులు పాల్గొన్నారు.