Oct 13,2023 21:42

ఎంపిడిఒ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు

ప్రజాశక్తి - సీతానగరం :  గ్రీన్‌ అంబాసిడర్లకు బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు జి.వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 నెలలుగా వేతనాల లేక గ్రీన్‌ అంబాసిడర్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలి మంటలతో కుటుంబాలను వెల్లదీస్తున్నారని, అయినా పాలకులు, అధికారులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇటీవల మండలంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతి అందజేస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పి నెల రోజులు కావస్తున్నా నేటికీ పరిష్కారం కాలేదన్నారు. జిల్లా ఉన్నతాధికారుల హామీ అమలుకాకపోతే ఇక తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. ఇప్పటికైనా తమ సమస్యను మానవతా దృష్టితో ఆలోచించి పెండింగ్‌ వేతనాలు చెల్లించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపిడిఒ బి.కృష్ణమహేష్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రీన్‌ అంబాసిడర్ల యూనియన్‌ నాయకులు గౌరి, సిమ్నాయుడు, సత్యనారాయణ, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మ లక్ష్మీపురం : మండలంలోని గ్రీన్‌ అంబాసిడర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపిడిఒ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ఏడాదిగా తమకు వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపారు. దసరా పండగ ముందు వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటి మండల కార్యదర్శి కె.గౌరీశ్వరరావు, సన్యాసిరావు, పాండురంగారావు ఉన్నారు.