ప్రజాశక్తి-ఉక్కునగరం : వేతనాల్లో కోతపెట్టడంపై స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. కాంట్రాక్టు కార్మికులకు కోతపెట్టిన రూ.2400 వెంటనే చెల్లించక పోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉక్కు యాజమాన్యాన్ని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు ఇడి వర్క్స్ కార్యాలయానికి వేలాదిమంది కార్మికులు చేరుకొని ఆందోళన చేశారు. ఉక్కు యాజమాన్యం నోటీస్ పే, బోనస్ పే, ఇఎస్‌ఐ తీసివేసి కార్మికులకు తీరని ద్రోహం చేసిందని యూనియన్ల నాయకులు చెప్పారు. నిలిపి వేసిన రూ.2400 వారం రోజుల్లో చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందని, ఈ హామీని నిలబెట్టుకోకపోతే సమ్మెకైనా కార్మికులు వెనుకాడరని హెచ్చరించారు. జిఎం హెచ్‌ఆర్ బినరుప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, మంత్రి రవి, నందికి తాతారావు, అవతారం, వంశీ, సత్యారావు, కోన రమణ, బొడ్డు పైడిరాజు, ఉమ్మడి అప్పారావు, గురునాధ్, కె.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.










