Aug 28,2023 00:14

పాడేరలుఓ ఆందోళన చేపడుతున్న పారిశుద్య కార్మికులు (ఫైల్‌ పోటొ)

ప్రజాశక్తి-పాడేరు:గ్రామ పంచాయతీల్లోనూ, సచివాలయాల్లోనూ పారిశుధ్య పనులు నిర్వర్తిస్తున్న కార్మికులు గత కొన్నేళ్లుగా వేతనాల వేతలను ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పారిశుధ్య కార్మికులు తమ వేతన బకాయిల కోసం పోరు సాగిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 21న అల్లూరి జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. వేతనాల కోసం సాగిస్తున్న తమ పోరులో భాగంగా ఈనెల 28న సోమవారం అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీవో కార్యాలయాలు వద్ద నిరసన కార్యక్రమాలకు పారిశుధ్య కార్మికులు సిద్ధమయ్యారు
అల్లూరి జిల్లాలోని సచివాలయాల్లో పని చేస్తున్న 930 మంది గ్రీన్‌ అంబాసిడర్లు, పంచాయితీల్లో పని చేస్తున్న సుమారు 500 మంది పారిశుద్ధ్య కార్మికులు గత కొన్నేళ్లుగా వేతనాల వెతలను ఎదుర్కొంటున్నారు. వీరికి ప్రతినెలా వేతనాలు సక్రమంగా అందకపోవడం సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతో కుటుంబాలు గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో, తమ వేతన బకాయిల కోసం పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టవలసిన పరిస్థితి ఎదురైంది. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అందలేదు. పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాం, బూట్లు, సేఫ్టీ మెటీరియల్‌ వంటి సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేయలేదు. వీరికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు లేవు. వృద్ధాప్యంతో చనిపోతున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఎటువంటి సాయం అందలేదు. పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురి చేసే టెండర్‌ విధానం మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారు. టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని వేతన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న పోరాటం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం నేతలు కోరారు.