ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మహిళ మండల సమైక్య (వెలుగు) వివోఏల వేతనాల్లో కోత విధించడం తగదని వివోఎల మండల అధ్యక్ష కార్యదర్శులు జ్యోతి, రాజారావు, వివోఏలు లక్ష్మి, సావిత్రి, కాసులమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ,మండలంలో వివోఏలు 57 మంది పని చేస్తున్నామన్నారు. సెర్ఫ్ నుండి నెలకు గౌరవ వేతనంగా 8 వేలు ఇస్తుంటే మండల ఏపిఎం, సీసీలు, అకౌంటెంట్ కార్యాలయ సిబ్బంది కుమ్మక్కై రకరకాల కారణాలతో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నుండి కోత విధిస్తున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా ముంచింగి పుట్టులోనే కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై స్పందనలో వినతి పత్రం సమర్పించినప్పటికీ కనీస విచారణ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గత కొద్ది నెలల క్రితం ప్రశ్నించినందుకు వివోలకు టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా వేధిస్తున్నారని తెలిపారు.










