
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి స్వచ్ఛభారత్ మిషన్ అమలులో భాగంగా నాలుగేళ్ల కిందట పంచాయతీల పరిధిలో 250 కుటుంబాలకు ఒకరిని చొప్పున గ్రీన్ అంబాసిడర్లను నియమించారు. ప్రారంభంలో జిల్లాకు సంబంధించి సుమారు 900 మందికిపైగా నియామకం చేశారు. నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం ప్రాతిపదికపై వీరికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వేతనాలు చెల్లించే వారు. కొన్నాళ్లపాటు మంజూరైన తర్వాత కార్పొరేషన్ నుంచి చెల్లింపులు నిలిచాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీల పరిధిలోని 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు జనరల్ నిధుల నుంచి వీరికి గౌరవ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా గౌరవ వేతనాల చెల్లింపులో ఎటువంటి మార్పులు కన్పించలేదు. దీంతో సకాలంలో వేతనాలు అందక వీరి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సుమారు 760 మంది మాత్రమే పని చేస్తున్నట్లు అంచనా.
జిల్లాలోని 365 పంచాయతీల్లో 280 పంచాయతీల వార్షిక ఆదాయం తక్కువగా ఉండడంతో ప్రభుత్వ జివో అమలుకు నోచుకోవడం లేదు. సాధారణ, ఆర్థిక వనరులు మెరుగ్గా ఉన్న పంచాయితీల్లో నిధులను బట్టి మాత్రమే గ్రీన్ అంబాసిడర్లకు చెల్లింపులు చేస్తున్నారు. చెత్త సేకరణే ధ్యేయంగా బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీ నిధుల మళ్లింపుతో వారికి కష్టాలు తప్పడం లేదు. పంచాయతీల పరిధిలో ఆదాయ వనరులు అంతంత మాత్రంగానే ఉండడంతో సకాలంలో జీతాలు అందడం లేదు. నిత్యం పారిశుధ్య పనుల్లో నిమగమయ్యే తమకు సకా లంలో వేతనాలు చెల్లించక పోతే ఎలా? అని వారు ప్రశ్నిస్తు న్నారు. ఇచ్చే అరకొర జీతం సక్రమంగా చెల్లించుకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు లేకుండా జీవనం సాగించడం ఎలానో అధికారులే చెప్పాలని వాపో తున్నారు. తడి, పొడి చెత్త సేకరణకు ఉపయోగించే రిక్షాల మరమ్మతులను సైతం వీరే చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి చెత్త సేకరణ పనిలో ఉండడంతో వేరే పనులకు వెళ్లలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లే అవకాశం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం అప్పులు చేసి కుటుంబ పోషణ చేసుకుంటున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులు కూడా లభించే పరిస్థితి ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ సమస్యను పంచాయితీ, మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం ఉండటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని హరిత రాయబారులకు చెల్లించాల్సిన బకాయిలతోపాటు, ఏ నెలకానెల గౌవరవేతనాలను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించాలి
జిల్లాలో అనేక పంచాయతీలలో వేతనాలు సకాలంలో రాకపోవటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా వేతనం చెల్లించేలా ఉన్నతాధికారులు చొరవ చూపించాలి. ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణకు ఉపకరణాలైన గ్లౌజులు, సబ్బులు, కొబ్బరినూనె తదితర సామాగ్రిని అందజేయాలి. కొన్ని పంచాయతీల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సైతం కూలీలుగా వినియోగిస్తున్నారు. అటువంటి చర్యలు సరైంది కాదు.
-బి. రాజులోవ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి