Apr 04,2023 23:41

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న వైటి.దాస్‌

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు నూతన వేతన ఒప్పందం అమలు చేయాలని స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యాన ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌ విభాగాధిపతి కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం విభాగాధిపతి పి.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నానుద్దేశించి వైటి దాస్‌ మాట్లాడుతూ, స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి స్థాయి ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులను కల్పించే విధంగా యాజమాన్యం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. ముడి సరుకు కోసం యాజమాన్యం అనాలోచితంగా ఇఒఐ ప్రవేశపెట్టి తద్వారా ప్రైవేటీకరణకు శ్రీకారం చుడుతోందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా తిరగబడాలని పిలుపునిచ్చారు.
మిత్రపక్షాల నాయకులు డివి.రమణారెడ్డి, కర్ర ప్రకాష్‌ మాట్లాడుతూ, నూతన వేతనాలు అమలు కాక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రజల సంపద అని, దీనిని ఏ ఒక్కరికో కట్టబెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు నాయకులు బి.అప్పారావు, మరిడయ్య, కృష్ణమూర్తి, తౌడన్న, పూర్ణచందర్రావు, ముత్యాలనాయుడు, ఎంవి.రమణ, చిన అప్పారావు తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.