Aug 06,2023 23:40

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ వేట్లపాలెంలో ఆదివారం హిమాచలప్రదేశ్‌ రాష్ట్ర గ్రామీణ జీవనోపాదుల మిషన్‌ బృందం పర్యటించింది. డిఆర్‌డిఎ, స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న బోటిక్‌ కేంద్రం, దోస్తి టిపిన్‌ సెంటర్‌, పాల డైరీ యూనిట్ల పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా హెచ్‌పిఎన్‌ఆర్‌ఎల్‌ఎం బృందం సిఇఒ అనిల్‌ శర్మ, స్టేట్‌ ప్రాజెక్టు మేనేజరు రాజత్‌ శర్మ, మిషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ రిఘు మాల్ట్‌లు వీటి పనితీరును పరిశీలించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందం తొలుత సామర్లకోట ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, మండల ఎపిఒం బి.ప్రశాంతి స్వాగతం పలికారు. తొలుత స్త్రీనిధి ద్వారా ఏర్పాటు చేసిన బొటిక్‌ సెంటర్‌ పనితీరు పరిశీలించారు. నిర్వా హకురాలు వంగా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ 2020లో ఏర్పాటు చేసి ఈ బొటిక్‌ ద్వారా తాను మహిళలకు ఉపాధి కల్పనతోపాటు తాము ఆర్ధిక లాభాలు పొందుతున్నట్లు చెప్పారు. రూ.20 లక్షల టర్నోవర్‌తో లాభసాటిగా నడపుతున్నామన్నారు. పాలకేంద్రం నిర్వాహకుడు మన్యం భవన్నారాయణ, పోతుల బుజ్జి నిర్వహిస్తున్న టిపిన్‌ సెంటర్‌లు పరిశీలించి హిమాచల్‌ బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, డిఆర్‌డిఎ డిపిఎంలు బి.వెంకటేశ్వరరావు, ఎ.కేశవ, స్త్రీనిధి ఎజిఎం వై.చిట్టిబాబు, ఎంపిఎం బి.ప్రశాంతి, యంగ్‌ ప్రొపెషనల్‌ సాయి తేజ, సిసిలు విష్ణు, శాంతకుమారి, రత్నం, పంచాయితీ విఒఎలు పాల్గొన్నారు.