Jul 27,2023 22:54

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌ వేట్లపాలెం పంచాయతీలో రూ.3.46 కోట్ల నిధుల అవకతవకలపై డిఎల్‌డిఒ ఫిర్యాదు మేరకు గురువారం సర్పంచ్‌ సిహెచ్‌.వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్‌ వల్లూరి శేషవేణి, పిడబ్ల్యూడి ఆపరేటర్‌ మాన్యాల సత్యనారాయణపై కేసులు నమోదయ్యాయి. వేట్లపాలెం పంచాయతీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ, ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలోనూ భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్టు గ్రామానికి చెందిన కొందరు నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్‌ స్పందనకు వరుస ఫిర్యాదులు చేశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు పలుమార్లు వేట్లపాలెం పంచాయతీలో డిపిఒ, డిఎల్‌డిఒ రికార్డులు తనిఖీ చేసి విచారణ జరిపారు. నిధుల వినియోగంలో అవకతవకలను గుర్తించారు. రూ.3.46 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు తేల్చారు. డివిజనల్‌ పంచాయతీ అధికారి అన్నామణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును సిఐ కె.దుర్గాప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.