ప్రజాశక్తి - భీమడోలు
విద్యార్థులు ఉత్తమ భావిపౌరులుగా తయారు కావడానికి, విద్య ద్వారా ఉన్నత స్థానాలను చేరేందుకు గ్రంథాలయాల సేవలను వినియోగించుకోవాలని భీమడోలు జెడ్‌పిటిసి సభ్యులు తుమ్మగుంట భవానీరంగా కోరారు. భీమడోలు శాఖా గ్రంథాలయంలో గ్రంథ పాలకులు కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమడోలు శాఖా గ్రంథాలయం కేంద్రంగా నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు 40 రోజుల పాటు కొనసాగే వేసవి విజ్ఞాన శిబిరాన్ని జెడ్‌పిటిసి సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇతర ప్రముఖులతో కలిసి వేసవి విజ్ఞాన శిబిరం వాల్‌పోస్లర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. భీమడోలు లయన్స్ క్లబ్ కోశాధికారి పివివి.సత్యనారాయణ (సత్యేంద్ర మాస్టారు) విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించారు. మానవత భీమడోలు శాఖ ఛైర్మన్ గుళ్ల నూకరాజు సంస్థ తరపున గ్రంథాలయానికి రూ.ఐదు వేల విలువైన పుస్తకాలు అందించేందుకు ముందుకు వచ్చారు. గ్రంథాలయ అభివృద్ధి సంఘ వైస్ ప్రెసిడెంట్ మద్దాల అప్పారావు, రామకుర్తి నాగేశ్వరరావు, సుతాపల్లి ప్రసాద్, విజ్ఞాన శిబిరంలో ముఖ్య రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించనున్న సామాజికవేత్త మండే సుధాకర్ పాల్గొన్నారు. పూళ్ల శాఖా గ్రంథాలయంలో గ్రంథ పాలకులు డిఎన్‌బి.అమరనాథ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరాలకు ముఖ్య అతిథిగా మానవత భీమడోలు శాఖ అధ్యక్షుడు పచ్చ వెంకటేశ్వరరావు, పివి.కృష్ణారావు పాల్గొన్నారు. శిబిరంలో నిర్వహించే విజ్ఞాన శిబిరం తరగతులకు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించే అన్నే వారి గూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు మస్తాన్ పాల్గొన్నారు. గుండుగొలను శాఖా గ్రంథాలయంలో గ్రంథ పాలకులు జి.నాగమణి ఆధ్వర్యంలో ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమాన్ని యుటిఎఫ్ సీనియర్ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు బి.సింహాచలం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ఎన్.శంకర్ పాల్గొన్నారు.
నూజివీడు రూరల్ : మండలంలోని గొల్లపల్లిలో ఉన్న బ్రాంచ్ లైబ్రరీలో సోమవారం సమ్మర్ క్యాంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ అన్నే రామకృష్ణయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎ.నాగిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో సంక్షిప్తంగా విద్యా బోధన ఉంటుందని, సువిశాలమైన విజ్ఞాన బండాగారం గ్రంథాలయాల్లో నిక్షిప్తం కాబడిందని తెలిపారు.
ముదినేపల్లి : విద్యార్థులు వేసవి విజ్ఞాన శిబిరం సద్వినియోగం చేసుకోవాలని అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి కోరారు. ముదినేపల్లి శాఖ గ్రంథాలయంలో మే ఎనిమిదో తేదీ నుంచి జూన్ 11వ వరకు నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరానికి తొలిరోజు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ విద్యార్థుల కోసం ఇండోర్ గేమ్స్ చెస్ బోర్డు, క్యారం బోర్డు, వాలీబాల్, రింగ్స్, స్కిప్పింగ్స్‌త్రెడ్స్ తదితర ఆట వస్తువులు గ్రంథాలయ అధికారిణి ఎం.శ్రీదేవికి అందించారు.
చింతలపూడి : విద్యార్థులు విజ్ఞానం పెంపొదించుకునేందుకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని చింతలపూడి గ్రంథాలయ ఛైర్మన్ మిర్యాల దిలిప్ అన్నారు. చింతలపూడి గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపును ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ ఇమ్రాన్, మండల సచివాలయాల ఇన్‌ఛార్జి శ్రీను, ముస్లిం మైనారిటీ సెక్రటరీ రెహ్మాన్, లైబ్రరీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆగిరిపల్లి గ్రామ ప్రముఖులు చౌటపల్లి లక్ష్మీవిక్టర్‌బాబు అన్నారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఆయన సోమవారం ఆగిరిపల్లి శాఖా గ్రంథాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి డి.నాగేశ్వరరావు, పి.నరసయ్య, కృష్ణారావు పాల్గొన్నారు.










