ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి ఆధ్వర్యాన ఆరిలోవ తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జివిఎంసి కల్యాణమండపం, సెయింట్ ఆన్స్ హైస్కూలు, డ్రైవర్స్ కాలనీలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాలను మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మంగళవారం సందర్శించారు. ఏయే క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు., ఎంతమంది పాల్గొంటున్నారు. వారికి అందించే డైట్ తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జివిఎంసి ఏటా విద్యార్థుల కోసం సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తోందని తెలిపారు. నగర పరిధిలో 333 సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు, పాలు, ఉడకబెట్టిన గుడ్లు, రాగి సంకటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కోచ్‌లు పాల్గొన్నారు.










