ప్రజాశక్తి-గుంటూరు : ఉపాధ్యాయుల వేసవి సెలువుల్ని హరించే చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ ఎం.కళాధర్ అన్నారు. వేసవి సెలువుల్లో వివిధ రకాల విధుల పేరుతో ఉపాధ్యాయుల్ని పాఠశాలలకు వెళ్లాలని ఒత్తిడి చేయటం మానుకోవాలని కోరుతూ గుంటూరు డిఇఒకు ఫ్యాప్టో నాయకులు గురువారం వినతిపత్రం అందచేశారు. వేసవి సెలవుల్లో నాడు-నేడు, ఆన్‌లైన్ ట్రైనింగ్, ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు, తదితర పనులను రాతపూర్వక ఆదేశాలు లేకుండా మౌఖిక ఆదేశాలు ద్వారా ఒత్తిడి చేయటం సరికాదని అన్నారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు ఏదైనా బాధ్యతలు అప్పగించాల్సి వస్తే, రాతపూర్వక ఆదేశాలిచ్చి, సెలవుల్లో పని చేసినందుకుగాను వారికి రావాల్సిన సంపాదిత సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో డిప్యూటీ సెక్రెటరీలు జి.మోహన్‌రావు, ఎమ్‌డి ఖాలీద్, జి.వేళాంగిణిరాజు, కార్యవర్గ సభ్యులు సిహెచ్.నరసింహారావు, కె.బసవలింగారావు, ఎం.సుబ్బారావు, ఫ్యాప్టో సభష్ట్ర్యలు జి.వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










