May 12,2023 23:48

డిఇఒకు వినతిపత్రం ఇస్తున్న ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి- అనకాపల్లి
వేసవి సెలవుల్లో ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన బాధ్యతలను, చదువంటే మాకిష్టం కార్యక్రమాలను, పదవ తరగతి పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణ వంటి అదనపు పనులు చేయమని ఉపాధ్యాయులను బలవంతం చేయడం సరికాదని ఫ్యాప్టో అనకాపల్లి జిల్లా కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్యాప్టో నాయకులు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ గొంది చినబ్బారు మాట్లాడుతూ విద్యాశాఖ వెకేషన్‌ డిపార్ట్మెంట్‌కు చెందినదని, ప్రభుత్వం ఉపాధ్యాయులకు సమ్మర్‌ వెకేషన్‌ లేకుండా చేస్తోందని వాపోయారు. సమ్మర్‌లో విధులు నిర్వహించమని అధికారిక ఉత్తర్వులు జారీ చేయకుండానే నోటి మాటగా చెప్పి పని చేయించడం మరీ దారుణమన్నారు. వేసవిలో ఉపాధ్యాయులతో పనిచేయించు కోవాలనుకుంటే వారికి సంపాదిత సెలవులు (ఈఎల్‌) మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానోపాధ్యాయులకు మూడు సంవత్సరాలుగా సంపాదిత సెలవులు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ కమిషనర్‌, డీఈవోల రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని, అందువల్ల వేసవి కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర కో-చైర్మన్‌ సిహెచ్‌.వెంకటేశ్వర్లు, జిల్లా సెక్రటరీ జనరల్‌ వై.సుధాకర్‌ రావు, కో- చైర్మన్‌ సాయి, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఎన్‌.సన్యాసి నాయుడు, కార్యవర్గ సభ్యులు వి.శ్రీలక్ష్మి, ఎం.శ్రీనివాసరావు, కె.రాజు, ఎంవి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.