ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వేసవి తీవ్రత పెరుగుతున్నా ప్రభుత్వ పరంగా ప్రజలకు వివిధ రూపాల్లో సాయం అందించేందుకు తగిన కార్యచరణ కొరవడింది. గుంటూరు, పల్నాడు జిల్లాల అధికారులు ఇంత వరకు ఇందుకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పన చేయలేదు. పట్టణ ప్రాంతాల్లో కనీసం చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు కూడా ఇంత వరకు తగిన ప్రణాళికలు విడుదల చేయలేదు. ఈ ప్రణాళికలన్నీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం వీటిని పరిశీలించి నిధులు విడుదల చేసేలోగా వేసవి ముగిసి వర్షాలు పడే అవకాశాలున్నాయి.
ఇప్పటికే గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తాగునీటి చెరువులను పూర్తిగా నింపకుండానే ఈనెల ఒకటో తేదీ నుంచి కుడికాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. నీటి విడుదల కొనసాగిస్తే పంటలకు సాగు నీరు వినియోగించుకుంటారన్న కారణంగా అవసరానికి మించి నీటి వినియోగం జరిగిందనే నెపంతో సాగర్ కాల్వలకు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో గ్రామాల్లో సాగు, తాగునీటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. నీటి విడుదల నిలిపివేసే ముందు వివిధ శాఖల అధికారులతో కలసి జిల్లా కలెక్టర్లు కనీసం సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ బోర్డు సమావేశాలు ఏడాదికి ఒక్కసారి కూడా నిర్వహించడం లేదు. వ్యవసాయ సలహా కమిటీ సమావేశాలలో నీటి పారుదల రంగంపై చర్చకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ సమావేశాలు కూడా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కావడం లేదు.
ప్రస్తుతం సాగర్ ఆయకట్టు పరిధిలో రబీ పంటలకు నీటి కొరత ఏర్పడింది. మిర్చి, మొక్కజొన్న, వరి పంటలకు నీటి సరఫరా లేక పైర్లు ఎండుతున్నాయి. 48 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా ప్రస్తుతం కంకిదశలో ఉంది. సాగర్ ఆయకట్టుపరిధిలో 1.80 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అయింది. మిర్చి చివరి కోతలకు సిద్ధం అవుతున్న తరుణంలో నీటి అవసరం ఉంది. పల్నాడు జిల్లాలో 35 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగ్గా ప్రస్తుతం కంకి దశలో ఉంది. రబీపంటలకు నీటి సరఫరా నిలిపివేయడంపై వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి కుడి కాలువ పరిధిలో 132 టిఎంసీలు నీరు వినియోగించుకోవాల్సి ఉండగా 200 టిఎంసీల నీరు వినియోగించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇందువల్ల నీటి సరఫరా నిలిపివేసినట్టు చెబుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రత పెరిగి జిల్లాలో క్రమంగా వడగాల్పులు వీస్తున్నాయి. శనివారం గుంటూరు జిల్లాలో 6 మండలాలు, పల్నాడు జిల్లాల్లో మూడు మండలాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా మండలాల్లో 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా తెనాలి, తాడికొండ, గంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, చేబ్రోలు, మాచర్ల, రెంటచింతల, నర్సరావుపేట ప్రాంతాల్లో వేడిగాలులకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం రెండు జిల్లాల పరిధిలో 17 మండలాల పరిధిలో వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.










