Apr 21,2023 00:17

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

ప్రజాశక్తి - గుంటూరు : వేసవిలో వడగాల్పుల దృష్ట్యా ఉద్యోగులు, ప్రజలు మధ్యాహ్నం 1-3 గంటల్లోపు సాధ్యమైనంత వరకూ బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డిఒ, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలతో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ గురువారం సమీక్షించారు. ఎండ, వడగాల్పుల నుంచి రక్షణ పొందటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచురించిన పోస్టర్లను అన్ని సచివాలయాల వద్ద ప్రదర్శించాలన్నారు. పట్టణాల్లో ప్రధాన రహదారులు, మఖ్యకూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటుకు మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. స్పందన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని, పరిష్కరించటానికి వీలుపడని అర్జీలపై కారణాలను దరఖాస్తుదారులకు వివరించి సరియైన పద్దతిలో ఎండార్స్మెంట్‌ ఇవ్వాలని చెప్పారు. అర్జీలు సక్రమంగా పరిష్కరించే విధానంపై సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించాలన్నారు. ఉపాధి హామీ పనులు 100 రోజులు కల్పించేలా గ్రామాల్లో పనులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలన్నారు. రెవెన్యూ అంశాలపై జెసి రాజకుమారి మాట్లాడుతూ గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ నిర్దేశిత సమయంలో సక్రమంగా పూర్తయ్యేందుకు ఎఫ్‌పిఒఎల్‌ఆర్‌లో గుర్తించిన మ్యూటేషన్లు, కరెక్షన్ల ధరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని, ధరఖాస్తుల పరిష్కార పురోగతిపై రోజువారీగా నివేదిక అందించాలని అన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, డ్వామా పీడీ యుగంధర్‌కుమార్‌, సీపీవో శేషశ్రీ, సర్వే ఏడీ రూప్లానాయక్‌, పంచాయ రాజ్‌ ఎస్‌ఇ బ్రహ్మయ్య, ఆర్‌డబ్య్లూ ఎస్‌ఎస్‌ఇ సురేష్‌, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జయరామకృష్ణ పాల్గొన్నారు.