ప్రజాశక్తి - ఆస్పరి
ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న కూలీలకు వేసవి అలవెన్స్ అమలు చేయాలని వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బి.బాలకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్పరిలో ఉపాధి పనులను పరిశీలించి, కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి హామీని పాత పద్ధతిలోనే కొనసాగించాలన్నారు. రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలని కోరారు. ప్రతి జాబ్ కార్డుకూ 200 రోజుల పని దినాలు కల్పించాలని తెలిపారు. పని ప్రదేశంలో టెంటు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేసి, మజ్జిగ ప్యాకెట్లు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని కోరారు. గ్రామం నుంచి పని ప్రదేశం 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న కూలీలకు రవాణా చార్జీలు ఇవ్వాలన్నారు. పని చేసిన స్లిప్పులు, గడార, గడ్డపార, గంప చార్జీలు ఇవ్వాలని కోరారు. నేడు పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో జరిగే ఉపాధి కూలీల సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యకాస మండల ఉపాధ్యక్షులు వెంకట రాముడు, రాము, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ










