Nov 18,2023 19:38

రైతులతో మాట్లాడుతున్న ప్రభాకర్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఆదోని మార్కెట్‌ యార్డులో వ్యాపారుల చేతిలో వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే వ్యాపారులపై చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌.రాధాకృష్ణ కోరారు. శనివారం వారు మార్కెట్‌ యార్డులో వేరుశనగ పంటల ధరలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. క్వింటా వేరుశనగ ధర రూ.5500, అలాగే రూ.7500 ప్రకారం ఉన్నాయని చెప్పారు. ఎకరాకు కేవలం 2, 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని, రూ.50 వేల వరకు ఖర్చయిందని తెలిపారు. ప్రతి ఎకరాకూ రూ.30 వేలకు పైగా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. క్వింటాకు కనీసం రూ.8 వేల ప్రకారం కొనుగోలు చేయాలని, అలాగే టెండర్‌ వేసిన వెంటనే వ్యాపారులు గ్రేడింగ్‌ చేయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరువుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ.30 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్‌ పాల్గొన్నారు.