పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో అత్యధికంగా పండించే వేరుశనగ రైతులకు సెకండరీ ప్రాసెస్; ప్రైమరీ ప్రాసెస్‌సింగ్ యూనిట్ల వల్ల రైతులకు ఎంతో ఉపయోగమని కలెక్టర్ అరుణ్‌బాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. మంగళవారం నాడు ధర్మవరం మండలం చిగిచెర్లలో సుమారు రూ.72 కోట్ల వ్యవయంతో వేరుశనగ సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్, రూ.5.5 కోట్లతో ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను వర్చువల్ విధానం ద్వారా తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయలు పండ్లు గ్రేడింగ్ ప్యాకింగ్ వసతుల ప్యాకింగ్ నెలకొల్పడంతో ప్రభుత్వం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాలో టమోటా లాంటి పంటలకు ధర స్థిరీకరణకు ఉపయోగపడుతుందని చెప్పారు. వేరుశనగకు సంబంధించి విలువ ఆధారిత ఉత్పత్తులు అయిన చిక్కి, నూనె, బటర్, రోస్టర్, సాల్టెడ్, పీనట్స్ తయారీ, ఇతర ఉత్పత్తుల కేంద్రం నెలకొల్పడం వల్ల 15 వేల రైతులు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. జిల్లాలో రెండున్నర లక్షల టన్నుల వేరుశనగ ఉత్పత్తి జరుగుతున్న తరుణంలో రైతులకు మార్కెటింగ్ పరమైన ఇబ్బందులు నుంచి ఉపశమనం కలుగుతుందని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. అనంతరం వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ల శిలాఫలకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, చెన్నేకొత్తపల్లి జడ్పిటిసి గోవిందరెడ్డి, ఎంపిపి అంజలి, ఏడీఏ కృష్ణయ్య, జిల్లా ఆహార శుద్ధి పరిశ్రమలు రిసోర్స్ పర్సన్ హరీష్, చిగిచెర్ల సర్పంచి ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు.










