ప్రజాశక్తి-నగరం: మండలంలోని ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంతో దెబ్బతిన్నటువంటి వేరుశనగ పొలాలను గురు వారం అధికారులు, శాస్త్రవేత్త లు పరిశీలించారు. మండలం లో 2 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయగా పంట 70 రోజుల నుంచి 90 రోజుల మధ్యకాలంలో ఉన్నదని చేతికి అందే సమయానికి వర్షం ప్రభావంతో పంటలు దెబ్బ తిన్నాయని రైతన్నలు అధికారుల వద్ద ఆవేదన చెందుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో అధిక వర్షాల వలన దెబ్బ తిన్న వేరుశనగ పొలాలను వ్యవసాయాధికారులు మరియు శాస్త్రవేత్తలు పరిశీలించారు. డిటిసి, డిఆర్‌సి నుంచి వచ్చిన ఎం విజయ నిర్మల, శాస్త్రవేత్త డాక్టర్ కే మృదుల పంట పొలాల్లో రైతులతో కలిసి వేరు శనగ పంటను పరిశీలించారు. వేరుశనగ సాగులో ఎకరానికి రూ.70 వేల నుంచి రూ.80 వేల ఖర్చు అయ్యిందని, వర్షపు నీటిలో నాని కాయలు కుళ్లిపోయాయని రైతులు తెలిపారు. పొలాలను దెబ్బతిన్న వివరాలు, ప్రజల అభిప్రాయాన్ని జిల్లా అధికారులకు తెలియచేసి తగిన న్యాయం చేస్తామని అన్నారు. రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ వేరుశనగ, అపరాల పంటలలో అధిక వర్షపు నీరు చేరి ఉంటే నీటిని తొలగించి పైరుపై లీటరు నీటికి పది గ్రాముల అన్నబేది, ఒక గ్రాము నిమ్మ ఉప్పు, పది గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. మొక్కజొన్న మరియు జొన్న పంటలలో వర్షపు నీటిని తొలగించి పంటలో ఒక బస్తా యూరియా అర బస్తా పొటాష్ పొలంలో వేయవలెనని సూచించారు. మండల వ్యవసాయాధికారి వేమూరి రమేష్‌బాబు, ఏఈవో ఎం శ్రీనివాసరావు విఏఏఎన్ కిరణ్మయి గ్రామ రైతులు పాల్గొన్నారు.










