Apr 11,2021 17:07

అది కొత్తగా వెలసిన కాలనీ. అక్కడున్న కాలనీ వాసులు వేపచెట్టు దగ్గరకు వస్తున్నారు. ఆ కాలనీ వాచ్‌మెన్‌ చెట్టు ఎక్కి, వేపపువ్వు కోస్తుంటే తీసుకొంటూ వెళ్తున్నారు.
'చెట్టు మిత్రమా! మొదటిసారి ఉగాది పండగ జరుపుకొనడం కోసం వేపపువ్వుకై కాలనీ వాసులు నీ దగ్గరకు రావడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది. ఈ రోజు నీలో చిరునవ్వును చూస్తాననుకొన్నాను. ఇంకా బాధపడుతూనే వున్నావు. ఎందుకు?' అడిగింది కాకి.
'కాకి మిత్రమా! నాకు చిరునవ్వా? ఇంకా నేను బతికి వున్నందుకు ప్రతిక్షణం కుమిలిపోతున్నాను. నా వాళ్లందరినీ ముక్కలు ముక్కలుగా కోస్తుంటే.. ఆ దృశ్యం చూడలేకపోయాను. అప్పుడే నన్నూ నరికేస్తారనుకొన్నాను. నా పరిస్థితి బాగోకగానీ, నన్నుమాత్రం ఎందుకో వదిలిపెట్టారు? ఈ ఉగాది రోజు మాత్రం నేను వీళ్లకు గుర్తుంటాను. నా పువ్వు కోసం వచ్చారు. ఆ తరువాత చచ్చానో, బతికానో చూడరు. నా దాహానికి గుక్కెడు నీరు కూడా పోయరు!' బాధపడుతూ అంది వేపచెట్టు.
చెట్టుపైన కారుతున్న నీటిని చూసి, అది వర్షపునీరు కాదని తెలుసుకొంది కాకి. ఆ చెట్టు గుండెల్లోంచి దు:ఖంతో పెల్లుబికిన నీరని గుర్తించింది.
'వేపచెట్టు నందు ఔషధ గుణాలున్నాయని మానవులు చెప్పుకొంటున్నారు. ఇకపైన మీ వేపచెట్లను నాటడానికి అవకాశం వుంది!' అంది కాకి.
'మొన్నటి రోజు ఈ కాలనీకి మంత్రి వచ్చి, ఏదో చెట్టుమొక్కను నాటారని చెప్పావుగా. దానిపేరు... నోటిలో తిరగని పేరు.. గులిమి.. కాదు.. కాదు.. వేరేపేరు ఏదో చెప్పావు గుర్తురావడం లేదు' అంది వేపచెట్టు.
'దానిపేరు గుల్మొహార్‌. అసలు ఈ కాలనీ ఇండ్లముందు అందం కోసం అంటూ నోటిలో ఇమడలేని పేర్లుగల చెట్లనే నాటుతున్నారు' అంది కాకి.
'బీమాజాతి వేపచెట్టు నాటకపోయినా మర్రిచెట్టు, చింతచెట్టు, మామిడి చెట్టు నాటాలన్న జ్ఞానం లేదు' అంది వేపచెట్టు.
'ప్రజలు నీ మీద నిర్లక్ష్యం వహించడం చూసి, విదేశీయులు నీపై పేటెంట్‌ అడుగుతున్నారు!' అంది కాకి.
'ఒక్కప్పుడు నా భాగాలను వాడుతుంటే మూఢనమ్మకమని వాదించిన విదేశీయులు, నేడు నాలోని ఔషధ గుణములను గుర్తించి, వారే కనుగొన్నట్లు చెబుతూ పేటెంట్‌ ఇవ్వాలని అడిగారు. అయినా వీరికి బుద్ధి రాదు. ఇప్పటికీ చెట్లు నరకడంలోనున్న ఆసక్తి చెట్లు నాటడంలో లేదు' కాస్త కోపంగానే అంది వేపచెట్టు.
కొంతకాలం గడిచింది.
ఒకరోజు ఒక్కసారిగా కుండపోత వర్షం కురియసాగింది. కాలనీలో కాదు.. కాదు.. ఒకనాటి చెరువులో మెల్లమెల్లగా నీరు ప్రవేశించసాగింది. ఆ కాలనీలో మంత్రిగారి బావమరిది ఇల్లు ఉండటంతో ఆ మంత్రికి కబురు పంపగానే వెంటనే స్పందించారు. ప్లాస్టిక్‌ పడవలు పంపారు.
'కాకి మిత్రమా! అక్కడ మూడు అడుగుల లోతు కూడా లేని నీటికి పడవలు ఏర్పాటుచేశారు' అంది చెట్టు.
'ఆ మంత్రి మానవత్వం ఉన్నవాడిలా ఉన్నాడు' అంది కాకి.
'కాకి మిత్రమా! వాడే మా పాలిట రాక్షసుడు. ఒకప్పుడు ఇది నీటితో కళకళలాడే అందమైన చెరువు. వర్షాలు రాక ఎండిపోతే, పట్టణంలోని చెత్తను ఇక్కడ వేయడం ప్రారంభించారు. మంత్రిగాడు చెరువులోని చెత్తను చూసి బాధపడ్డాడు. వాడి బాధకు సమాధానంగా వాడి బావమరిది ఈ చెరువును కబ్జా చేశాడు. చెత్తనంతా శుభ్రం చేసి, ఇక్కడున్న చెట్లన్నీ రాక్షసంగా నరికించాడు. ఈ స్థలాన్ని ప్లాట్లు వేసి, వ్యాపారం చేశాడు. అలా కొన్ని కోట్లు సంపాదించాడు. ఇప్పుడు వర్షం నీరు వస్తుందని తెలియగానే ఆ మంత్రిగాడు ప్రభుత్వం తరఫున అన్ని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సహాయక బడ్జెట్‌లో ఎంత దోచుకొంటాడో?' అంది చెట్టు.
'ప్రకృతికి విరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా చెరువులను ఆక్రమించి ఇళ్లు, కాలేజీలు కట్టడం తప్పని తెలిసినా ధైర్యంగా కడుతున్నారు. ఒకవేళ చట్టం దృష్టిలో వచ్చినా ఆ అక్రమ ఆస్థిని ప్రభుత్వం ఆక్రమించుకొని, మరలా చెరువుగా మార్చడానికి కలలో కూడా ప్రయత్నించదన్న గట్టి నమ్మకం. అందుకే ఎవరూ ఏమిచెయ్యరన్న ధైర్యంతో చెరువులు ఆక్రమించుకొంటున్నారు' అంది కాకి.
చీకటిపడినా ఇంకా వర్షం కురుస్తూనే వుంది.
అక్కడికి పదిమంది యువకులు వచ్చి, వేపచెట్టు కింద నిలబడ్డారు.
'మనమందరమూ చెరువులోనున్న ఖాళీ ఇళ్లలో ఈ రాత్రి గడపాలి. పొద్దున్నే మనల్ని కాపాడటం కోసం వచ్చి ఇక్కడకు తీసుకొనివస్తారు. ఇక్కడ మనందరికీ సహాయనిధిగా ఒక్కొక్కరికి ఇరవైవేల రూపాయల చొప్పున మంత్రి ఇస్తారు!' అన్నాడొకడు.
'అన్నా! ఇక్కడున్న పడవలో వెళ్దామా?' అడిగాడింకొకడు.
'మోకాళ్ళ లోతు కూడా లేని నీటిలో నడచివెళ్ళలేమా? రేపు ఆ పడవల్లో మనల్ని తీసుకొనివచ్చి, మనల్ని కాపాడినట్లు డ్రామా ఆడి, మనకు సహాయనిధి ఇస్తారు.'
'ఈ రోజు సాయంత్రం కాలనీలోని వారందరికీ ఇరవై వేలు ఇచ్చినట్లు చెప్పారు. మనం ఆ ఇంటిలోనే లేముగా? ఎలా ఇస్తారు?'
'లెక్కల ప్రకారం కాలనీలో వున్నా, సంఖ్యకన్నా రెండింతలు సహాయనిధి ఇచ్చినా ఎవరూ అడగరు. అలా అడిగేటట్లుంటే చెరువులో ఇళ్లు కట్టేటప్పుడే అడ్డుపడి వుంటారు. మంత్రిగారు మనమీద దయతలచి, ఈ సహాయనిధి తీసుకొనడానికి అవకాశం కల్పించాడు' అన్నాడు మరొకడు.
'చెరువులో ఇల్లు కట్టడం తప్పని మీడియా వారు అంటున్నారే!' అన్నాడొకడు.
'మీడియా వారు ఎంత అరిచినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. ప్రభుత్వం ఏమైనా తప్పని చెప్పిందా? మన మంత్రిగారు ఏమైనా తప్పని చెప్పాడా? ప్రతి విజయానికి వెనుక ఒక ఆడది ఉన్నట్లు, చెరువులు దోచుకోవాలని అనుకుంటే వారి వెనుక ఒక మంత్రి ఉంటాడు' అన్నాడు మరొకడు.
'సహాయనిధి కోసం ఆ ఇళ్లలో ఈ రాత్రి గడపడానికి మనలాగే మరికొంతమంది వస్తారు. వర్షం వలన ఈ కాలనీకి పెద్ద ప్రమాదం లేదని ఎవరో చెప్పారంట. మన మంత్రి బావమరిది కూడా ఇంతకుమునుపు అక్కడకు వెళ్ళాడు. వారింట్లో మందు పార్టీ చేసుకొంటున్నారు' అన్నాడింకొకడు.
అందరూ నడచుకొంటూ వెళ్లారు. ఆ రాత్రి ఒక్కసారిగా పెద్ద వర్షం కురిసింది. వర్షం నీటిలో ఇళ్లు మునిగిపోయాయి.
మంత్రి బావమరిది మద్యం మత్తులో ఇంటిలోనికి వస్తున్న నీటి నుండి తప్పించుకోలేకపోయాడు. సహాయక బృందం వారు వచ్చి మంత్రి బావమరిది శవాన్ని పడవలో తీసుకొనిరావడం వేపచెట్టు చూసింది.
'కాకి మిత్రమా! ఈ రోజు నిజంగా నాకు ఉగాది పండగ. చెరువును ఆక్రమించి, వ్యాపారం చేసిన వాడిని ఎవరూ శిక్షించలేదని బాధపడ్డాను. ఈ అధికారులు, మంత్రులు శిక్షించ లేకపోయినా ప్రకృతి ఆగ్రహానికి బలై పోయాడు. నాకు చాలా సంతోషంగా ఉంది' అంటూ మెల్లగా ఊగుతూ వేపచెట్టు నవ్వసాగింది.
                                                                                                             ఓట్ర ప్రకాష్‌ రావు
                                                                                                           097874 46026