Feb 28,2023 00:47
అధికారికి అర్జీ ఇస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-వేమూరు/బాపట్ల జిల్లా: వేమూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లోని పదో తరగతి విద్యార్థుల పరీక్ష కేంద్రాన్ని కొనసాగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య విజ్ఞప్తి చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో డిఇవో అందుబాటులో లేకపోవడంతో సూపరింటెండెంట్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడుతూ.. వేమూరు మండలం వేమూరులో ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్‌ మూడో తేదీన జరుగుతున్న ఎస్‌ఎస్‌సి బోర్డు పరీక్షలకు పరీక్షా సెంటర్‌ను తీసివేసి ఈ విద్యార్థులను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంపని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పరీక్ష రాయడానికి సెంటర్‌ను ఇచ్చారన్నారు. జిల్లా విద్యా అధికారులు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని యథావిధిగా పాత పద్ధతిలోనే వేమూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎస్‌ఎస్‌సి బోర్డు పరీక్షల నిర్వహణకు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పరీక్షా సెంటర్‌ను కొనసాగించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సూర్య, రాజేష్‌, శ్రీను, మోహన్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.