ప్రజాశక్తి - భట్టిప్రోలు
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బాబుకు తోడు మేము సైతం అనే నినాదంతో వేమూరు ఎన్టీఆర్ పుర వేదిక వద్ద టిడిపి కార్యకర్తలు నిరాహార దీక్ష బుధవారం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని అన్నారు. ఎలాంటి అవినీతి మచ్చలేని చంద్రబాబును దురుద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఆ భయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేయించారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలను కూడా పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడం హేయమైన చర్యని అన్నారు. మరో ఆరు నెలల్లో టిడిపి అధికారం చేపడుతుందని అన్నారు. వైసీపీ నాయకులకు సహకరించే అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మైనేని మురళీకృష్ణ, జొన్నలగడ్డ విజయబాబు, వాకా శేషుబాబు, వేములపల్లి జగన్నాధరావు, బట్టు మల్లికార్జునరావు, చుండూరు, అమర్తలూరు, కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










