Nov 24,2022 23:23

మీడియాతో మాట్లాడుతున్న యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్‌

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : వివిధ రంగాలలో ప్రముఖులు చేసిన కృషిని ఆధారంగా లోక్‌ నాయక్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాదికి స్వాతి వార పత్రిక సంపాదకులు వేమూరు బలరామ్‌నకు అందించనున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ తెలిపారు. గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ లోని హిందీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిలికాన్‌ ఆంధ్ర యూనివర్సిటీ చైర్మన్‌ డాక్టర్‌ కూచిపట్ల ఆనంద్‌, విజయవాడ కెఎల్‌ యూనివర్సిటీ చైర్మన్‌ డాక్టర్‌ కోనేరు సత్యనారాయణ, రాజమండ్రి జిఎస్‌ఎల్‌ మెడికల్‌ ఆసుపత్రి కళాశాల స్థాపకులు డాక్టర్‌ గండి భాస్కరరావు, సినీ నటులు జయప్రద, జయసుధలకు జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పురస్కారం క్రింద రూ.లక్ష అందజేయనున్నట్లు తెలిపారు. 2023 జనవరి 18న ఎన్‌టిఆర్‌ శత జయంతిని విఎంఆర్‌డిఎ చిల్డ్రన్స్‌ ఏరినాలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో లోక్‌ నాయక్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ కార్యదర్శి బాబయ్య, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ కుమారుడు శివప్రసాద్‌ పాల్గొన్నారు.