ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి బసవమ్మ వాగు సమీపంలో వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులతో పలు ప్రాంతాల నుండి జనం కుటుంబ సమేతంగా వచ్చి వెదుకులాడుతున్నారు. పిల్లలను పాఠశాలలు మాన్పించి మరీ వజ్రాలు వెతికేందుకు తీసుకొచ్చేవారు కొందరైతే చట్టి బిడ్డలను చంకనేసుకుని వచ్చేవారు మరికొందరు. వీరంతా భోజనాల క్యారేజీలు తెచ్చుకుని మరీ ఉదయం నుండి సాయంత్రం వరకూ వజ్రాల వేటలో నిమగమవుతున్నారు. వినుకొండ, చిలకలూరిపేట, పెదకూరపాడు, పిడుగురాళ్ల, మాచర్ల తదితర ప్రాంతల నుండి తండోపతండాలుగా వస్తున్నారు. సత్తెనపల్లి ప్రాంతంలో ఎక్కడ ఎర్రమట్టి కనపడినా అక్కడ వజ్రాల కోసం వెదుకుతున్నారు. కొడవళ్లు, ఇనుప కడ్డీలతో తవ్వుతూ అంగుళం అంగుళం గాలిస్తున్నారు. మరోవైపు రోజురోజుకూ జనం పెరుగుతుండడంతో ఆ ప్రాంతమంతా తిరునాళ్లను తలపిస్తోంది. వీధి విక్రేతలు సైతం వ్యాపారం కోసం వస్తున్నారు. రహదార్ల వెంట ఐస్ క్రిమ్, సోడాబండ్లు వెలిశాయి.










