
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కష్టం అంటే చాలు వాలిపోతున్నాడు. సాయం అంటే చాలు కరిగిపోతున్నాడు. సందర్భం ఏదైనా అవతలి వ్యక్తి ఆపదలో ఉంటే వెంటనే వెళ్లిపోతున్నాడు. ఇప్పటికే ఎంతోమందికి సాయం చేసి, భారీ డొనేషన్లు అందజేశారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు పలు రూపాల్లో సాయం అందిస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. 3600 మంది జూనియర్ డ్యాన్సర్లకు నెలకు సరిపడా నిత్యావసరాలను అందించేందుకు ముందుకొచ్చారు. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ విషయాన్ని తెలిపారు. ఆయన నడుపుతున్న ఫౌండేషన్ ద్వారా అక్షయ్ ఈ సాయాన్ని అందించనున్నారు. నిత్యావసరాల కిట్‌ను, లేదా దానికి సరిపడా సొమ్మును డ్యాన్సర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు.
అసలు పేరు : రాజీవ్ హరి ఓం భాటియా
పుట్టిన తేదీ : 9 సెప్టెంబర్, 1967
పుట్టిన ప్రదేశం : అమృత్‌సర్, పంజాబ్
నివాస ప్రాంతం : ముంబై
భార్య : ట్వింకిల్ ఖన్నా
పిల్లలు : ఆరవ్, నేత్ర
తల్లిదండ్రులు : హరి ఓం భాటియా, అరుణా భాటియా
సోదరి : అల్కా భాటియా
'ప్యాడ్‌మ్యాన్' నటుడు అక్షయ్ కుమార్ దేశంలో ఎలాంటి విపత్తు వచ్చినా ముందుగా స్పందిస్తుంటారు. గత ఏడాది కోవిడ్ సమయంలో ఎంతోమందికి సాయం చేశారు. ఈసారి కరోనా రెండో దశలోనూ ఆస్పత్రులకు కావాల్సిన పరికరాలతో పాటు ఆక్సిజన్ సిలిండర్స్ కోవిడ్ పడకలను విరాళంగా ఇచ్చి, తన పెద్దమనసు చాటుకున్నారు. తాజాగా ఆయన మూడువేల ఆరువందల మంది డ్యాన్సర్లకు నెలవారీ రేషన్ సరుకులు అందించడానికి ముందుకొచ్చారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను అతని 50వ పుట్టినరోజు కోసం.. అక్షయ్ ''ఏమి కావాలో.. కోరుకో?'' అని అడిగారు. అందుకు ''నేనొక సాయం కోరాను. ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు'' అని తెలిపారు. ''పదహారు వందలమంది జూనియర్ కొరియోగ్రాఫర్లు, వృద్ధ నత్యకారులకు ఒక నెల రేషన్‌తో పాటు, సుమారు 2000 మంది ఇతర సహాయ డ్యాన్సర్లకు సహాయం చేయమని కోరాను. దీనికి అక్షయ్ అంగీకరించారు'' అని ఆచార్య వెల్లడించారు. గణేష్ ఆచార్య ఫౌండేషన్ ద్వారా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, ప్రాంతాల వారీగా రేషన్ పంపిణీ, ప్యాకింగ్‌ను గణేష్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు తోడు అతని భార్య కూడా పాల్గొంటుంది. నమోదు చేసుకున్న డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు అవసరమైన వస్తువులను కొనడానికి డబ్బును లేదా వారి కుటుంబాలను పోషించడానికి రేషన్ సరకుల కిట్‌ను అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సాయం పూర్తిగా డ్యాన్సర్ల కోసమేనట! ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'రామ్‌సేతు' అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ని ఈ ఏడాది మార్చి 18న అయోధ్యలో ప్రారంభించారు. అక్షరు ఇందులో పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు.

గతంలోనూ అనేకసార్లు..

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బీహార్, అసోం వరద బాధితులకు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందజేశారు బాలీవుడ్ స్టార్ అక్షరుకుమార్. ఆ సందర్భంలో అక్షరు ఔదార్యానికి ముఖ్యమంత్రులు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపి, అక్షరుని ప్రశంసించారు.
కరోనా మొదటి వేవ్ సమయంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. బాలీవుడ్ స్టార్ అక్షరు పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు అందించారు. ఇవే కాకుండా మాస్క్‌లు, పీపీఈ కిట్లు, రాపిడ్ ఫైర్ కిట్లు కొనుగోలు చేయడానికి బీఎంసీకి రూ.3 కోట్లు ఇచ్చారు. ముంబై పోలీస్ ఫౌండేషన్‌లో రూ. 2 కోట్లు జమ చేశారు. అంతేకాకుండా, రోజువారీ కూలీలకు సహాయం చేయడానికి సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) కు రూ.45 లక్షలు అందించారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన 40 మంది సైనిక జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నెలకొల్పిన వీర్ ట్రస్ట్‌కు రూ. 5 కోట్లు ఇచ్చి, తన గొప్ప మనుసు చాటుకున్నారు.