Aug 21,2023 18:22

ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలోని 1,454 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సర్వే వేగవంతంగా జరుగుతోందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై భీమవరం, ఉండి, ఆచంట నియోజకవర్గాల ఎఇఆర్‌ఒలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ గతేడాది జులై ఒకటి నుండి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకూ, ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆగస్టు 21వ తేదీ వరకూ రెండు విడతల్లో ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్నారు. ఈ జాబితాల నుంచి పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో వెయ్యి మంది ఓటర్లను రాండమ్‌ చెక్‌ చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఫొటో సిమిలారిటీ, షిఫ్టింగ్‌, చనిపోయిన వారి ఓట్ల పరిశీలనకు పంచనామా ఉంటే ఫారం-7 ను సంతకంతో తీసుకోవడంతోపాటు, ఫారం 13, 14లో నోటీసులు అందజేయాలన్నారు. చనిపోయిన వారి ఓటు తొలగింపునకు మరణ ధ్రువీకరణ పత్రం సరిపోతుందన్నారు. ఓటర్ల జాబితా పరిశీలనలో మార్పు, చేర్పులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కోపరేటివ్‌ అధికారి రవికుమార్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఉయ్యాల ఆదిశేషు, జిల్లా సర్వే అధికారి జాషువా, ఎన్నికల సూపరింటెండెంట్‌ ఎల్‌.నరసింహారావు పాల్గొన్నారు.