అనంతపురం కలెక్టరేట్ : జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ ఆర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 412 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలకు సరైన పద్ధతి ప్రకారం సకాలంలో పరిష్కారం చూపించాలన్నారు. అర్జీదారుడి సంతకం లేకుండా ఫిర్యాదుకు ఎండార్స్‌మెంట్ ఇవ్వరాదన్నారు. అర్జీదారుల సంతప్తి స్థాయి తక్కువగా ఉందని, సంతప్తి స్థాయిలో పురోగతి మరింత పెరగాలన్నారు. జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, అగ్రికల్చర్, ఏపీఎస్పీడీసీఎల్, తదితర శాఖల నుంచి ఎక్కువగా అర్జీలు వస్తున్నాయన్నారు. వాటిని గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుల సంతప్తి స్థాయి బాగున్నవి, బాగోలేని వాటిపై నివేదికలు అందజేయాలన్నారు. ఆర్డీవోలు వారి పరిధిలోని తహశీల్దార్లతో సమావేశాలు నిర్వహించి జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఆర్డీవో గ్రంధి శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, ఆనంద్, సిపిఒ అశోక్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పీడీ శ్రీదేవితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










