ప్రజాశక్తి - ఏలూరు
రెవెన్యూ అతిథి గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ రోడ్డు గిరిజన భవన్ పక్కన ఉన్న రెవెన్యూ అతిథి గృహం పాత భవనం స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను అధికా రులతో కలిసి కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అతిథి గృహం చుట్టూ మొక్కలతో గార్డెనింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణ పనులు పూర్తి నాణ్యతతో ఉండేలా చూడాలని, ఇంటీరి యర్ కూడా ఆకర్షణీయంగా ఉండేలా నిర్మాణ పనులు ఉండాలని సూచించారు. నిర్దేశించిన సమయం లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆఫీసర్స్ క్లబ్ సందర్శన
అనంతరం ఆఫీసర్స్ క్లబ్‌ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సందర్శించారు. క్లబ్‌లో ఏర్పాటు చేసిన జిమ్, వ్యాయామ పరికరాలను పరిశీలించారు. జిల్లా అధికారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు క్లబ్‌లో ప్రత్యేక వ్యాయామాలు, ఆధునిక వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేశామని, ఆ అవకాశాన్ని వినియోగించుకుని, ప్రతీరోజు వ్యాయాయం చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, ఎఇ రాఘవేణి, తహశీల్దార్ సోమశేఖర్, కాంట్రాక్టర్ రాజు పాల్గొన్నారు.










