ప్రజాశక్తి - రేపల్లె
నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని, వాటిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను, ఎస్‌హెచ్ఓ, రైటర్, కంప్యూటర్, సిబ్బంది విశ్రాంతి గదులు, కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదిని పరిశీలించారు. సచివాలయ మహిళ పోలీసులు, పోలీస్ సిబ్బందితో సమావేశమైనారు. సిబ్బంది శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల స్వభావాన్ని వాకబు చేశారు. రౌడీలు, అనుమానితులు, పాత నేరస్తులు వారి కదలికలు గురించిన వివరాలు, స్థల వివాదాలు, కుటుంబ తగాదాలు, వర్గ విభేదాలు గురించిన సమాచారాన్ని సమీక్షించారు. గతంలో జరిగిన నేరాల్లోని ముద్దాయిల ప్రవర్తన తెలుసుకున్నారు. గ్రామ సచివాలయ మహిళా పోలీసులు అంకితభావం, నిబద్దతతో పనిచేయాలని అన్నారు. ఎప్పటికప్పుడు స్టేషన్ అధికారికి తెలపాలని సూచించారు. చూడటానికి కుటుంబ సమస్యలు చిన్నవిగా ఉన్నప్పటికీ వాటివల్లే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని అన్నారు. వాటిపై తొలిదశలో చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలపై, చిన్న పిల్లలపై జరిగే నేరాలపై దృష్టి సారించాలని అన్నారు. ఒంటరి మహిళల నివాసాలను సందర్శిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాల అవశ్యకతను గురించి ప్రజలకు అవగాహన కల్పించి స్వతహాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. పోలీస్ సిబ్బంది దత్తత గ్రామాలను సందర్శిస్తూ వుండాలని అన్నారు. వృత్తినైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసులు సత్వరం పరిష్కరించాలని చెప్పారు. మహిళలు, మైనర్ బాలికలపై నేరాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల రేపల్లె రైల్వే స్టేషన్‌లో జరిగిన హత్యాచార కేసును వేగవంతంగా దర్యాప్తు చేయించి, నేరస్థులకు సంవత్సర కాలంలోనే 20సంవత్సరాలు జైలు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకున్న ఎస్పీని స్థానిక మహిళా సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. తనిఖీలో రేపల్లె డిఎస్‌పి టి మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ ఏం నజీర్‌బేగ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, సిసి హరికృష్ణ పాల్గొన్నారు.










