ప్రజాశక్తి - కౌతాళం
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి కృషి వల్ల పాలక మండలి కమిటీ ఛైర్మన్ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఉరుకుంద పుణ్యక్షేత్రంలో గ్రానైట్ బండ పరుపు పనులకు రూ.1.28 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో గ్రానైట్ బండ పరుపు పనులు, అండర్ గ్రౌండ్ పైపులైన్ పనులు వేగవంతంగా జరిగేలా సహాయ కమిషనర్ వాణి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 4 రాజగోపురాలతో పాటు మహా ప్రాకారం ప్రహరీ పనులు పూర్తయ్యాయి. ప్రధాన రాజ గోపురం పనులు పూర్తయితే ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టడానికి పాలకమండలి, దేవాలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రహరీ అంతర్భాగంలో గ్రానైట్ బండ పరుపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులను దేవాలయ సహాయ కమిషనర్ వాణి, పర్యవేక్షకులు వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, రామానందం గురువారం పరిశీలించారు.