Jul 09,2023 23:56

సిపిఒ పి.శేషశ్రీ

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సిపిఒ) పి.శేషశ్రీ తెలిపారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రజా ప్రతినిధులు పర్యటించిన సమయంలో ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యల పరిష్కారం కోసం ఒక్కో సచివాలయానికి ప్రభుత్వం రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు సంబంధిత సచివాలయాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇస్తారని, తర్వాత పనులు ప్రారంభిస్తారని ఆమె వివరించారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.
సచివాలయాల పరిధిలో ఏయే పనులు చేస్తారు?
సిసి రోడ్లు, గ్రావెల్‌ రోడ్లు, తాగునీరు, డ్రెయిన్లు, వీధి లైట్లు, కమ్యూనిటీ హాళ్లు తదితర పనులకు ఎక్కువగా ప్రతిపాదనలు అందాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటించిన సందర్భంలో వచ్చిన సమస్యలను ఆయా సచివాలయాల పరిధిలో ఎంపిక చేసిన పనులకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేస్తారు. వీటిని జిల్లా కలెక్టర్‌ ఆమోదించి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం పరిశీలనకు పంపుతారు. ఆ తరువాత పరిపాలన ఆమోదంతో పనులు ప్రారంభిస్తారు.
పనుల పురోగతి ఎలా ఉంది?
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు 568 ఉన్నాయి. రూ.113.60 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 568 సచివాలయాల్లో 843 పనులకు జిల్లా కలెక్టర్‌, గ్రామ, వార్డు సచివాలయం శాఖ ఆమోదించింది. వీటిల్లో 498 పనులు వివిధ దశలో ఉన్నాయి. 275 పనులు పూర్తయ్యాయి. గ్రామీణ నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ పరిపాలన శాఖ, విద్యుత్‌ శాఖలకు సంబంధించి మొత్తం 843 పనులు మంజూరు చేయగా 492 పనులు ప్రారంభించారు. వీటిల్లో 322 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 140 పూర్తయ్యాయి. మొత్తం రూ.56.80 కోట్లతో ఈ నాలుగు శాఖలతో అభివృద్ధి పనులు మంజూరు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని పనులు తిరస్కరించారు. పలు నియోజకవర్గాల్లో నామినేషన్‌ పద్ధతిపై కూడా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది.
భూకమతాల సర్వే పూర్తయిందా?
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే సమగ్ర భూకమతాల సర్వే గతేడాది చేపట్టాం. ఇటీవల సర్వే నివేదికను ప్రభుత్వానికి ప్రభుత్వానికి పంపారు. మొదటి దశ సర్వే పూర్తయింది. భూమి హక్కు దారులు, భూమి స్వరూపం, సాగుభూమి, ఇతర వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు.
ఎంపి నిధుల వినియోగం ఎలా ఉంది?
పార్లమెంటు సభ్యులు ఎంపి ల్యాడ్స్‌ నిధులకు సంబంధించి ఇస్తున్న ప్రతిపాదనలకు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ ఆమోదించి పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖలకు పంపుతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి.