
ప్రజాశక్తి-తెనాలి : పట్టణ పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగులో కీలకంగా ఉన్న ప్రజారోగ్య విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనికితోడు పారిశుధ్య కార్మికుల కొరత మరింత ఇబ్బందికరంగా ఉంది. దాదాపు రెండు లక్షల జనాభా కలిగి, సమీపంలోని పది మండలాలకు కేంద్ర బిందువుగా ఉన్న స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి పారిశుధ్యం నిత్యం సవాలుగా మారింది. స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛతాహి సేవ, స్వచ్ఛ తెనాలి.. ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సిబ్బంది కొరత ప్రభావం మాత్రం ఉన్న కొద్దిమందిపై పడుతోంది.
తెనాలి పట్టణ జనాభా రెండు లక్షల వరకు ఉండగా 40 వార్డులున్నాయి. సమీప గ్రామాల నుంచి వివిధ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం తెనాలికి ప్రతిరోజూ దాదాపు 40 వేల మంది వచ్చిపోతుంటారు. దీంతో పారిశుధ్యం అనేది ఎంతో కీలకమైన అంశం. కార్మికులు ఎంత శ్రమిస్తున్నా పట్టణంలో ఏదో ఒక మూల సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణకు పట్టణానికి సంబంధించి తొమ్మిది శానిటరీ డివిజన్లు ఉన్నాయి. వీటికి 9 మంది శానిటరీ ఇన్‌స్పెకర్టు ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉన్న ఐదుగురు హెల్త్ ఇన్‌స్పెక్టర్లకు శానిటరి ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా నిర్వహించాల్సి వస్తోంది. వాస్తవానికి ఆయా ఖాళీల భర్తీపై ప్రభుత్వ నిషేదం అమల్లో ఉన్న దృష్ట్యా కనుచూపు మేరలో హెల్త్ ఇన్‌స్పెక్టర్, శానిటరి ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా శానిటరి ఇన్‌స్పెక్టర్లకు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లకు పనిభారం తప్పటం లేదు.
వెంటాడుతున్న పారిశుధ్య కార్మికుల కొరత
పురపాలక సంఘంలో పారిశుధ్య కార్మికుల కొరత కూడా ఉంది. మొత్తం తొమ్మిది శానిటరి డివిజన్లలో ప్రస్తుతం శాశ్వత ప్రాతిపడికన పనిచేసే కార్మికులు కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు. గతంలో దాదాపు 140 మంది వరకూ ఉండేవారు. అయితే కాలక్రమంలో ఉద్యోగ విరమణ చేయటంతో అ సంఖ్య 80కి పడిపోయింది. నిబంధనల ప్రకారం ఒక్కో కార్మికుడు రోజుకు 750 మీటర్లు శుభ్రం చేయాల్సి ఉంది. దీంతో ఏపి ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా 322 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. అయినా సీజనల్‌గా కార్మికుల కొరత తీరనిదే. వర్షాకాలంలో పారిశుధ్యం మెరుగు పరచటం కార్మికులకు సవాలుగానే ఉంది. ఈ నేపథ్యంలో 40 మందిని సీజనల్‌గా నియమించి పారిశుధ్య విధులకు కేటాయిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఖాళీ నివేశన స్థలాల్లో నీరు నిలిచి, చెట్లు పెరిగి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇది చుట్టపక్కల నివసించే వారికి ఇబ్బందికరంగా ఉంది. అలాంటి స్థలాలను గుర్తించి వాటి యజమానులకు పురపాలక సంఘం ద్వారా నోటీసులిస్తున్నారు. అప్పటికీ స్పందించకుంటే పురపాలక సంఘం తరఫునే కార్మికులను కేటాయించి, వాటిని తొలగింపచేసి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
అయినా అలసత్వం లేదు
డాక్టర్ కె.హెలెన్‌నిర్మల, మున్సిపల్ ఆరోగ్యాధికారి, తెనాలి.
పారిశుధ్య విభాగంలో సిబ్బంది, కార్మికుల కొరత ఉంది. తొమ్మిది శానిటరి డివిజన్లకు ముగ్గురే ఇన్‌స్పెక్టర్లున్నారు. వీరితోపాటు మున్సిపాల్టీలోని ఐదుగురు హెల్త్ ఇన్‌స్పెక్టర్లకు ఇన్‌చార్జి బాద్యతలు కేటాయించాం. కార్మికుల కొరత కూడా ఉంది. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపకన 80 మంది మాత్రమే ఉన్నారు. వారికితోడు ఆప్కాస్ ద్వారా 322 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి అదనంగా మరో 40 మందిని సీజనల్‌గా నియమించుకుని పారిశుధ్యం మెరుగుకు అసత్వం లేకుండా కృషి చేస్తున్నాం.