Jul 22,2023 23:22

వేధిస్తున్న గుబులు

      టిడిపి మహానాడులో మొదటి దశ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. ఆ తర్వాత మరికొన్ని హామీలను అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటిస్తూ వస్తున్నారు. చంద్రబాబు హామీలపై సంక్షేమ పథకాలపై విముఖత చూపిస్తున్న వారు టిడిపి తీరును వ్యతిరేకిస్తున్నారని కొందరు వైసిపి నేతలు చెప్తున్నారు. కొత్త హామీలను గుప్పిస్తున్న చంద్రబాబు, ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తారో? ఎత్తివేస్తారో? స్పష్టం చేయడం లేదు. జగన్‌ తొలిసారి హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలు నమ్మారు. చంద్రబాబుకు ఆ అవకాశం లేదు. ఐదేళ్ల పాలనలో ఏం చేశారో ప్రజలకు అనుభవమైంది. అందువల్ల చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించరని వైసిపి నేతల నుంచి విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఎదుర్కొని ప్రజలు తమవైపు తిరిగేలా, తిరిగి చంద్రబాబును విశ్వసించేలా జిల్లాలో టిడిపి ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు మాటపై ప్రజల్లో ఎలా విశ్వసనీయత పెంచాలన్న ఆలోచన టిడిపిలో కనిపించడం లేదు. వైసిపి ప్రభుత్వ దుర్మార్గ పాలనపై ప్రజలు తిరగబడతారని, ఆ వ్యతిరేకత అంతా తమవైపే ఓట్లరూపంలో మళ్లుతుందన్న ఆశల్లో టిడిపి అధినేతతో పాటు జిల్లా నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో టిడిపిలో ఆయా నియోజకవర్గాల్లో గ్రూపుల గోల ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు ఉన్నా, జిల్లా నాయకునిగా ఆయన్ను గుర్తించే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న కూన రవికుమార్‌ కూడా జిల్లాలో పార్టీపై గట్టి పట్టు సాధించినట్లు కనిపించడం లేదు. అలాంటి కార్యక్రమాలు కూడా కనిపించడం లేదు. ప్రత్యర్థుల బలహీనతలే తమ బలం అనుకున్నంత కాలం అది మరింత బలహీనతకు దారితీస్తుందన్నది జిల్లా రాజకీయాల చరిత్ర చెప్తోంది. సొంత బలాన్ని పెంచుకోకుండా, పోయిన విశ్వాసాన్ని తిరిగి ప్రజల నుంచి పొందనంత కాలం రాజకీయ శక్తుల బలాబలాల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నది జిల్లా చరిత్ర కూడా చెప్తోంది. ఇప్పటికే వైసిపి, టిడిపి, జనసేన బిజెపిని అంటిపెట్టుకుని ఉన్నాయన్నది ఆ పార్టీల నడక చెప్తోంది. జిల్లా రాజకీయాల్లో మార్పులు రావాలంటే కమలం పార్టీని అన్ని విధాలుగా దూరం చేసుకున్న వారికే జిల్లాలోనూ రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది. అది జిల్లా అభివృద్ధికి మూలమవుతుంది. లేదంటే ప్రత్యామ్నాయ శక్తులు దూసుకొస్తాయి. జిల్లాలోనూ సరికొత్త రాజకీయాలను తెర పైకి తీసుకొచ్చే వాతావరణం ముంచుకొస్తుంది. జిల్లా ప్రజలకూ దిగులు, గుబులు అప్పుడే మాయమవుతుంది.
- సత్తారు భాస్కరరావు