ప్రజాశక్తి - నెల్లిమర్ల : విద్యార్థులు సమాజంలో జరుగుతున్న దాడులు, వేధింపులు పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్‌పి టి. గోవిందరావు సూచించారు. బుధవారం మొయిద జెడ్‌పి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఐ పి.నారాయణరావు ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మహిళల పై జరుగుతున్న దాడుల, సైబర్ నేరాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ సమాజంలో మహిళల పై జరుగుతున్న దాడులు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు వినియోగం వల్ల జరిగే అనర్ధాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచి సమాజానికి ఉపయోగ పడాలని మహిళలూ, బాలికల పట్ల జరుగుతున్న దాడులు ధైర్యంగా ఎదిరించి నిలబడాలని అన్నారు. సైబర్ నేరాల గురించి తెలుసుకొని మోసానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
తెర్లాం: మండలంలోని నెమలం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో విద్యార్థులకు ఎస్‌ఐ ఆర్ రమేస్ బుధవారం చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని స్కూల్లో ర్యాగింగ్‌కు ఎవరూ పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొబైల్ ఫోన్లు వాడకుండా సోషల్ మీడియా ఫాలో అవ్వకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










