ప్రారంభిస్తున్న నాయకులు, అధికారులు
వేడుకగా ''నా భూమి - నా దేశం'' కార్యక్రమం
ప్రజాశక్తి-నెల్లూరు:ఆజాదీ కా అమత్ మహౌత్సవం కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన '' నా భూమి - నా దేశం'', '' నేల తల్లికి నమస్కారం - వీరులకు వందనం'' కార్యక్రమాలను శనివారం వేడుకగా నిర్వహించారు.రూరల్ నియోజకవర్గంలోని 23 వ డివిజన్ పడారుపల్లి మారుతీ పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కమిషనర్ వికాస్ మర్మత్ లు హాజరయ్యారు. పడారుపల్లి పార్కులో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నా భూమి-నా దేశం కార్యక్రమంలో భాగంగా నేల తల్లికి నమస్కారం- వీరులకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత దేశ రక్షణ వ్యవస్థలో సైనికులుగా దేశ రక్షణ కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను ఎంపీ ఘనంగా సన్మానించారు. పార్కు ఆవరణంలో నా భూమి - నా దేశం కార్యక్రమంలో భాగంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.అనంతరం 14 వ డివిజను బాలాజీ నగర్ వేపదొరువు ప్రాంతంలోని పబ్లిక్ పార్కులో నిర్వహించిన '' నా భూమి - నా దేశం'', '' నేల తల్లికి నమస్కారం - వీరులకు వందనం'' కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించుటకు, వారిని ఉత్తేజ పరిచేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో నగర పాలక సంస్థ వివిధ స్థానిక డివిజను కార్పొరేటర్, వివిధ డివిజన్ కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ పార్టీ నాయకులు, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










