Sep 22,2023 21:26

గరుడ వాహన సేవలో టిటిడి ఛైర్మన్‌


వేడుకగా గరుడసేవ
ప్రజాశక్తి - తిరుమల
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం మోహినీ అలంకారంలోనూ, రాత్రి గరుడవాహనంపైనా మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. గరుడసేవకు లక్షల్లో భక్తులు వస్తారని అనుకున్నా ఆశించిన స్థాయిలో రాలేదన్న చర్చ నడిచింది. ఎక్కువగా తమిళ భక్తులు, తిరుపతి స్థానికులతోనే గరుడసేవ సందడి కనిపించింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు యానాదయ్య, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్‌ఒ నరసింహ కిషోర్‌ పాల్గొన్నారు.
వాహనబేరర్లకు పంచెలు పంపిణీ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సేవలందిస్తున్న వాహనబేరర్లు, మేళం సిబ్బందికి శుక్రవారం తమిళనాడుకు చెందిన దాత తంగదొరై రెండు లక్షల విలువైన 120 పంచెలను బహుమానంగా అందించారు. ఉదయం పల్లకీ ఉత్సవం అనంతరం వైభవోత్సవ మండపంలో టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి చేతుల మీదుగా దాత ఈ పంచెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్‌ శ్రీహరి, పారుపత్తేదార్‌ తులసీప్రసాద్‌ పాల్గొన్నారు.
భక్తుల సదుపాయాలు పరిశీలన
గరుడసేవను చూడటానికి తిరుమల నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను ఈవో ఎవి ధర్మారెడ్డితో కలిసి టిటిడి ఛైర్మన్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. భక్తులకు చేసిన ఏర్పాట్లు, ఆహారం పాలు, కాఫీ, టీ, తాగునీరు అందుతున్నాయా అని గ్యాలరీల్లోని భక్తులతో మాట్లాడారు. గ్యాలరీలో వేచి ఉండే ప్రతి భక్తునికీ గరుడ వాహనంపై ఉన్న మలయప్పస్వామివారి దర్శనం చేయించిన తరువాతే స్వామివారు ఆలయానికి వేంచేస్తారని తెలిపారు. దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు.
భక్తుల కోసం అన్నప్రసాదాలు
భక్తుల కోసం ఉదయం 5 నుండి 6 గంటల మధ్య పాలు, కాఫీ, ఉదయం 6.30 నుండి 8 గంటల మధ్య ఉప్మా, పొంగళి పంపిణీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలకు సాంబార్‌ అన్నం, టమాటా అన్నం, స్వీట్‌ పొంగల్‌ అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు భక్తులకు రెండు లక్షలకు పైగా పులిహౌర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సాయంత్రం సుండల్‌, కాఫీ, పాలు పంపిణీ చేశారు. సాయంత్రం 7 గంటలకు గరుడవాహనం ప్రారంభం కానుండగా ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల వరకు వెజిటబుల్‌ కిచిడీ పంపిణీ చేశారు.
అధికారులకు అభినందనలు
టీటీడీ జెఈవో వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎఫ్‌ఏసీఏవో బాలాజి, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు విధులు అప్పగించిన సీనియర్‌ అధికారులను టీటీడీ ఛైర్మన్‌, ఈవో అభినందించారు.
గరుడ వాహన సేవలో టిటిడి ఛైర్మన్‌