Sep 06,2023 20:56

వేదిస్తున్న యూరియా కొరత

రామసముద్రం : మండలంలో యూరియా కొరత వేధిస్తోంది. అవసరం మేరకు యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలి విడత ఎరువు వేసే సమయం దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు వ్యాపారులు కుమ్మక్కై కత్రిమ కొరత సష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవసరమైన ఎరువులు కావాల్సిన రైతులు కియోస్క్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందులో వివరాలు నమోదు చేసుకున్నా సకాలంలో ఎరువులు అందుబాటులోకి రాకపోవడంతో ఇటు అధికారులు అటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదును కోల్పోతే పంట చేతికి రాదనే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్రంలోని సోమయాజులపల్లి, పులగూరకోట, లక్ష్మీపురం, శ్రీనివాసపురం, గౌనిపల్లి, లక్ష్మీపురం క్రాస్‌, ముళబాగల్‌, గుడిపల్లి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. రైతులకు అనుకూలమైన రైతు భరోసా కేంద్రాల్లో అందించాల్సిన యూరియా అరకొరగా అందించడంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అదును కోల్పోతే మొదటికే మోసం అవుతుందని భావించి ఖర్చులు భారమైన భరిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.270 విక్రయిస్తున్నారు. మండలంలో సాగు విస్తీర్ణంబట్టి ఎరువులు అందించాల్సి ఉంది. కానీ... అధికారుల లెక్కలకు పంటల విస్తీర్ణానికి అవసరమైన ఎరువులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వాస్తవంగా కాంప్లెక్‌ ఎరువులు (డీఏపీ, గ్రోమోర్‌) కొరత అంతగా లేదు. ప్రస్తుత సీజన్లో మండల వ్యాప్తంగా ముందస్తుగా వర్షాలు కురవడంతో చిన్నచిన్న చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండటంతో భూగర్భజలాలు పెరగడంతోపాటు నేలలో తేమ పెరగడంతో వరి నాట్లు ఊపందుకున్నాయి. వరిపంటకు అవసరమైన మేర యూరియాను వినియోగించాల్సి ఉంది. యూరియాకు కొరత ఏర్పడింది. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం రెండు విడతలకు ఎకరాకి 50 కిలోల కాంప్లెక్స్‌ ఎరువులు, వంద కిలోల యూరియా వేయాలి. రెండో విడతలో యూరియా అవసరాన్ని బట్టి వేస్తారు. మండలంలో వరి 600 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. టమోటా కాలిఫ్లవర్‌, బంతి, చేమంతి ఇతర పంటలను సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
అధికారులు లెక్కల ప్రకారం రెండు విడతలకు మండలంలో 50 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమని యూరియా 10 టన్నుల వరకు అవసరముందని వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. కేవలం కొన్ని పంటల సాగుకు సంబంధించి అవసరమైన కాంప్లెక్స్‌ ఎరువులను మాత్రమే లెక్కల్లో చూపుతూ మిగతా పంటలను విస్మరిస్తున్నారు. రైతాంగానికి సరిపడే ఎరువులు అందడం లేదు. వాస్తవంగా తొలివిడతకు అన్ని పంటలకు 400 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 20 టన్నుల వరకు యూరియా అవసరముంది. మండలంలో 14 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ప్రైవేటు పెస్టిసైడ్స్‌ డీలర్లు కత్రిమ ఎరువుల కొరత సష్టించి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
ఆందోళన అవసరం లేదు
మండలంలో ఎరువుల కొరత లేదు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంతమేర ఎరువులను రైతులకు అందించాం. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ఎరువులు అందిస్తాం. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- మోహన్‌ కుమార్‌, ఎఒ, రామసముద్రం.