ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా కేంద్రంలో ఈనెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న విజయనగరం ఉత్సవాల్లో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలకు ఆయా కమిటీలు త్వరగా తుదిరూపు ఇచ్చి ఖరారు చేయాలని కలెక్టర్ శ్రీమతి ఎస్.నాగలక్ష్మి సూచించారు. ఉత్సవ నిర్వహణలో భాగంగా ఒక్కో వేదికలో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలతో కలెక్టర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ వేదికల్లో ఏర్పాటు చేయాల్సిన క్రీడా, వినోద, సాంస్కతిక కార్యక్రమాలు, వివిధ రకాల పోటీల నిర్వహణ తదితర అంశాలపై ఈ సందర్భంగా జిల్లా అధికారులు, శాశ్వత సభ్యులతో చర్చించారు. గత ఏడాది కార్యక్రమాలు నిర్వహించిన వేదికలతో పాటు ఈ ఏడాది అదనంగా మరికొన్ని వేదికల్లో ఉత్సవాల నిర్వహణకు ప్రతిపాదించారు. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి బదులుగా లేడీస్ క్లబ్‌లో సాహిత్య వేదిక పేరుతో కవిసమ్మేళనం, సాహిత్యగోష్టి వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రతిపాదించారు. కోట సమీపంలో బొంకులదిబ్బ వద్ద ప్రఖ్యాత సురభి నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఆనందగజపతి ఆడిటోరియం మరమ్మత్తులకు గురైన కారణంగా వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టేందుకు సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, శాశ్వత సభ్యులు కాపుగంటి ప్రకాష్, డోల మన్మధకుమార్, బుచ్చిబాబు, మేకా అనంతలక్ష్మి, రాధికారాణి, స్కార్క్ సొసైటీ పద్మనాభం, బాలు, డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఆర్‌డిఎ పీడీ కల్యాణ్‌చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్, ఎస్‌డిసిలు సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, సిపిఒ బాలాజీ, డిఇఒ లింగేశ్వరరెడ్డి, ఉద్యానశాఖ ఎడి జమదగ్ని తదితరులు పాల్గొన్నారు.










