ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వేసవి తీవ్రతతో గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉపాధి హామీ కూలీలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే వేసవి ప్రభావం కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే వేడిగాలులు పెరుగుతున్నాయి. ఎండ వేడి వల్ల పనుల్లో ఉన్న కూలీలు మాడిపోతున్నారు. పనులు జరిగే ప్రదేశాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. టెంట్లు వేయించాలని, ఉదయం 11 గంటల కల్లా పనులు ముగించి కూలీలను నీడ ప్రదేశానికి తీసుకువెళ్లాలని మార్గదర్శకాలు ఉన్నాయి. కొన్నిచోట్ల 11 గంటల తరువాత కూడా పనులు చేయిస్తున్నారు.
పల్నాడు జిల్లాలోని వివిధ మండలాల్లో 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది పల్నాడు జిల్లాలో ఉపాధి హామీ కింద 87,35,991 పని దినాలు కల్పించాలని నిర్ణయించగా గుంటూరు జిల్లాలో 30,85,104 పనిదినాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు. ప్రస్తుతం ఎక్కువగా మట్టి పనులు చేయిస్తున్నారు. రహదారుల నిర్మాణం, కందకాలు తవ్వడం, కాల్వలను తవ్వడం, పూడికతీత, సాగునీటి పారుదలకు వీలుగా కాల్వగట్లను పట్టిష్టపర్చడం పనులు పల్నాడు జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల పనిదినాలు సంఖ్యను బాగా తగ్గించారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గతంలో నర్సరీలు ఉన్నా ఇప్పుడు వాటినీ నిలిపివేశారు. అటవీ విస్తీర్ణమూ తక్కువగా ఉండటంతో ఇటీవల జిల్లా సామాజిక అటవీశాఖ విభాగాన్ని కూడా ఎత్తివేయడంతో మొక్కల పెంపకం నిలిచింది. గతంలో ఉపాధి హామీ కింద మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ కీలకంగా ఉండేది. గతేడాది మొక్కల కొనుగోలు, నిర్వహణ, సంరక్షణకు నిధుల ఇవ్వకపోవడం వల్ల నామమాత్రంగానే పెంపకం, పంపిణీ జరిగింది. ఈ ఏడాది పనిదినాల లక్ష్యంలో కూడా మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉపాధి హామీ నిధులతో గతంలో సామాజిక అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అటవీశాఖ సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో నర్సరీల నుంచి మొక్కల సరఫరాకు నిర్వహకులు ముందుకు రావడం లేదు. ఉపాధి హామీ నిధులతో బయట నుంచి మొక్కలు కొనుగోలు చేసి నాటడానికి ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. ఉపాధి హామీ సిబ్బంది కూడా నర్సరీలు సొంతంగా ఏర్పాటు చేసేందుకు అవకాశాలు లేవు. వారికి తగిన వసతులు లేవు. మొక్కల పంపిణీ లేకపోవడం వల్ల చాలా మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో మున్సిపాల్టీల పరిధిలోని ఉద్యాన శాఖ విభాగాలు ప్రైవేటు నర్సరీల నుంచి నేరుగా మొక్కలు కొనుగోలు చేస్తున్నాయి. పల్నాడు జిల్లాలో సామాజిక అటవీశాఖ కొనసాగుతోంది. దీంతో పల్నాడు జిల్లాలో కొంత మేరకు మొక్కలను పెంచుతున్నారు.










