Jan 13,2022 21:46
  •  తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌
  • ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్‌
  • భాగస్వామ్య పార్టీలకు సీట్లు ఖరారు చేసిన బిజెపి
  • తమ జాబితా కూడా సిద్ధమంటున్న బిఎస్‌పి

లక్నో : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. 125 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విడుదల చేశారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌తో సహా 50 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చారు. వీరిలో ఆశావర్కర్ల కోసం ఆందోళనలు చేసిన పూనమ్‌ పాండే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ 'వేధింపులు, చిత్ర హింసలకు గురైన బాధితులకు కాంగ్రెస్‌ అండగా వుంటుందనే సందేశాన్ని ఈ జాబితాతో పార్టీ పంపుతుంది' అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం టికెట్లు ఇస్తామని మరోసారి ప్రియాంక ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక ప్రయత్నం ద్వారా రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలను తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు. ఆశా సింగ్‌ ఉన్నావ్‌ నియోజకవర్గం నుంచి, పూనమ్‌ పాండే షాజహాన్‌ పూర్‌ నుంచి పోటీ పడనున్నారు. పాంఖూరీ పాఠక్‌ నోయిడా నుంచి, మనోజ్‌ చౌదరీ దాద్రి నుంచి, దీపక్‌ భాటీ జెవార్‌ నుంచి పోటీ చేస్తున్నారు.
బిజెపి కూడా తొలి దశ అభ్యర్థులు, పొత్తు ఉన్న పార్టీలకు సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్ర మంత్రి అమిత్‌షా నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సిఇసి) సమావేశం తరువాత ఈ వివరాలను బయటకు వెల్లడించనున్నారు. సిఎం యోగి ఆదిత్యనాధ్‌ అయోధ్య నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.
బిఎస్‌పి జాబితా ఖరారు
300 మంది అభ్యర్థులతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) జాబితా కూడా ఖరారైంది. ఇందులో 90 మంది దళిత అభ్యర్థులు ఉన్నారని బిఎస్‌పి ప్రధాన కార్యదర్శి ఎస్‌సి మిశ్రా గురువారం తెలిపారు. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే సరికి దళితుల సంఖ్య మరింత పెరగొచ్చునని చెప్పారు. బ్రాహ్మణ, ముస్లిం అభ్యర్థులకు కూడా సరైన ప్రాధాన్యత ఇచ్చామని, మాయావతి జన్మదినమైన ఈ నెల 15న జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. 2007 ఎన్నికల్లో విజయవంతమైన దళిత-బ్రాహ్మణ ఫార్ములాతో ఈ ఎన్నికల్లోనూ ముందుకు వెళతామని మాయావతి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యుపిలో మొత్తం 403 స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.