Nov 24,2022 21:29

అధినేతల పర్యటనలతో జిల్లాలో ఎన్నికల కాక
సిఎం పర్యటనకు పోటీగా చంద్రబాబు టూర్‌
త్వరలోనే జనసేన అధ్యక్షుడు పవన్‌ పర్యటించే అవకాశం
ఇప్పటి నుంచే కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న అధినేతలు
ప్ర్రతిపక్షాలకు ఆయుధంగా ధాన్యం కొనుగోళ్లు, ఆక్వా ధర
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఏడాదిన్నరకు ముందే జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రధాన పార్టీల అధినేతల జిల్లా పర్యటనలతో జిల్లా రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. పార్టీ కేడర్‌లో కొత్త జోష్‌ నింపి ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఇప్పటి నుంచే అధినేతలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే పార్టీ అధినేతలు జిల్లాలకు వస్తున్నారు. ఇప్పటికే సిఎం జగన్‌ జిల్లా పర్యటన పూర్తవగా ఈ నెల 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారైంది. త్వరలోనే జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సైతం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అధినేతల పర్యటనలతో ఆయా పార్టీల కేడర్‌లో జోష్‌ కన్పిస్తోంది. నేతల పర్యటనలను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నెల 21న సిఎం జగన్‌ నరసాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో రూ.మూడు వేల కోట్లకుపైగా విలువ చేసే పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేనలపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇదేం ఖర్మరా బాబు అంటూ చంద్రబాబును ఎద్దేవా చేస్తూ సిఎం విమర్శలు చేశారు. జనసేనను రౌడీసేన అంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు. వైసిపి కేడర్‌లో జోష్‌ నింపేలా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్‌ తన పర్యటన సాగించారు. సిఎం విమర్శలను తిప్పికొడుతూ అదే నినాదంతో 'రాష్ట్రానికి ఇదేం ఖర్మ' అంటూ కార్యక్రమాన్ని టిడిపి తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా నుంచే ప్రారంభించేందుకు ఈ నెల 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఈ పర్యటన సాగనుంది. రోడ్‌షో, బహిరంగ సభలతో చంద్రబాబు పర్యటన సాగనుంది. టిడిపి కేడర్‌లో జోష్‌ నింపి ఎన్నికలకు సమాయత్తం చేసేలా చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై హామీలు గుప్పించేలా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ పర్యటన సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గెలుపోటములను నిర్ధేశించేది ఇక్కడ సీట్లే
రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలన్నా జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు కీలకంగా మారుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 అసెంబ్లీ స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. ఏ జిల్లాలోనూ ఈ విధంగా సీట్లు రాలేదు. మిగిలిన ప్రాంతాల్లో టిడిపికి సీట్లు తగ్గినప్పటికీ గోదావరి జిల్లాల్లో వచ్చిన సీట్లతోనే టిడిపి అధికారం చేపట్టింది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 15 స్థానాల్లో 13 స్థానాలు వైసిపి గెలుచుకుని అధికారం చేపట్టింది. ఎన్నికల్లో ఏ పార్టీనైనా ఇక్కడి ప్రజలు ఏకపక్షంగా గెలిపిస్తున్నారు. దీంతో జిల్లాపై ప్రధాన పార్టీలు కేంద్రీకరిస్తున్నాయి. 2024 ఎన్నికల్లోనూ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని టిడిపి, వైసిపి తమ వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో అధినాయకులు జిల్లాపై ప్రధానంగా దృష్టి సారించారనే చర్చ సాగుతోంది.
రైతుల సమస్యలే ప్రధాన ఆయుధం
జిల్లాలో 80 శాతం ప్రజానీకం వ్యవసాయంపైనే అధారపడి జీవిస్తున్నారు. ప్రధాన పంటలుగా వరి, ఆక్వా ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. వర్షాలు వెంటాడుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆక్వాకు సైతం సరైన ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఇటీవల రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైతుల సమస్యలను ప్రధాన ఆయుధంగా చేసుకుని ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టేలా ప్రతిపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు, ఆక్వా రంగంలో సమస్యలు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి.