
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్ల జాబితాలపై ప్రధాన రాజకీయపార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికల్లో గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్ల జాబితాలపై నిశిత పరిశీలన చేస్తున్నారు. గుంటూరు,పల్నాడు జిల్లాల పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలపై టిడిపి, వైసిపి వ్యూహ ప్రతి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై స్పెషల్ క్యాంపెయిన్లో భాగంగా శని, ఆదివారాల్లో రెండు జిల్లాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులపై వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా బిఎల్ఓలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నారు.
పలు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న స్పెషల్ క్యాంపె యిన్ను ఏఈఆర్ఒలు, సూపర్వైజరీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన స్పెషల్ క్యాంపుల్లో ప్రజల నుండి నూతన ఓటుకై దరఖాస్తులు, ఓటర్ కార్డులో చిరునామా, పేరు, పుట్టిన తేది తదితర మార్పులకు దరఖాస్తులు అందాయి. వీటితో పాటు వేర్వేరు కారణాలతో తొలగింపునకు ఫారం-7 కూడాపెద్ద సంఖ్యలో దాఖలు చేశారు. వీరిలో స్థానికంగా ఉండటం లేదని, పలువురు మృతి చెందారని, బోగస్ ఓటర్ల పేరుతో వైసిపి నాయకులు భారీగా దరఖాస్తులు అందిస్తున్నారని, తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపించారు. గత రెండు రోజుల్లో గురటూరులో దాదాపు రెండు వేలకు పైగా ఫారం-7 దరఖాస్తులు అందించారని తెలిసింది. వీటిల్లో వైసిపి నాయకులు వారి పార్టీ కార్యకర్తల చేత సమర్పించినవి ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. నగరంలోని ఒక వైసిపి నాయకులు మహిళల చేత దరఖాస్తులు చేయించినట్టు కూడా విమర్శలు వచ్చాయి. జనసేన, టిడిపికి బలమైన సామాజిక తరగతులకు చెందిన వారిని ఎక్కువగా తొలగిస్తున్నారని పలువురు టిడిపి నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒకే రోజు 858 ఫారం-7 అందాయని తెలిసింది. వీటిల్లో వైసిపి వారు 663, టిడిపి 100కిపైగా ఇచ్చినట్టు తెలుస్తోంది. గుంటూరు బ్రాడీపేటలో పోలింగ్ బూత్ 140 పరిధిలో ఒకే సామాజిక తరగతికి చెందిన 23 ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు సమర్పించారు. జెకెసి కళాశాల రోడ్డులోని నవభారత్నగర్లో ఒక అపార్టుమెంట్లో 30 ఓట్లు ఉండగా వీటిల్లో 12 ఓట్లు తొలగించాలని వైసిపి కార్యకర్త వెంటరెడ్డి ఫారం -7 కొంతమంది వ్యక్తులు సమర్పించారని టిడిపి నాయకులు తెలిపారు. ఫారం -7 దరఖాస్తు చేసిన వారి వివరాలను తెలుసుకునే పనిలో టిడిపి నాయకులు నిమగం అయ్యారు. వీటిపై ఆరా తీయగా ఒక వైసిపి నాయకుని సూచన మేరకు దరఖాస్తులు ఇచ్చామని సంబంధిత వ్యక్తులు తెలిపారు. గుంటూరు తూర్పులో 250 వచ్చాయి. తెనాలి, మంగళగిరి, వినుకొండ,గురజాల, సత్తెనపల్లి, మాచర్లలో ఫారం-7 దరఖాస్తులు వందల సంఖ్యలో వచ్చాయని సమాచారం.