ప్రజాశక్తి-పాడేరు టౌన్:గిరిజన ప్రాంతాల్లో వెదురు కొమ్ముల సీజన్ ప్రారంభమైంది. వెదురు చెట్ల మొదల చిగుళ్లను గిరిజనులంతా పూర్వం నుంచి వెదురు కొమ్ములుగా పిలుస్తుంటారు. వెదురు కొమ్ముల కూర మంచి రుచిగా ఉంటుంది. ఈ చిగుళ్లను సేకరించి వాటిని మంచి శాఖాహార వంటగా ఈ సీజన్ లో గిరిజనులతో పాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా అధికంగా తింటుంటారు. వర్షాకాలంలో వెదురు చెట్ల మొదళ్లకు చిగుళ్లు ఏర్పతాయి. అడవులతో పాటు గిరిజనులు సొంతంగా వేసుకున్న వెదురు చెట్ల వద్ద ఈ చిగుళ్లను సేకరించి ఇళ్లకు తీసుకువచ్చి కూర వండుకునేలా వెదురు కొమ్ములుగా తయారు చేస్తారు. ఆ వెదురు చిగుళ్లు సేకరించకపోతే కొన్నాళ్లకు అవే నిటారుగా ఎదిగి వెదురు వనాలుగా పెరుగుతుంటాయి. ఈ సీజన్‌లో దొరికే వెదురు కొమ్ముల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, అవి తినడం ద్వారా ఆరోగ్యానికి దోహదం చేస్తుందని పూర్వం నుంచి గిరిజనుల నమ్మకం. ఈ వెదురు కొమ్ములను వేపుడు, ఇగురు కూరలుగా వండుకుని తింటారు.
ఎగబడి కొంటున్న వినియోగదారులు..
వెదురు కొమ్ములు వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వారపు సంతలు, మండల కేంద్రాల్లో, పాడేరు ఘాట్‌లో ఆదివాసీలు వెదురు కొమ్ములను విక్రయిస్తున్నారు. ఒక వాటా (ఐదు కొమ్ములు) రూ.50 ధరతో అమ్ముడవుతుంది. పాడేరు డివిజన్‌తో పాటు పాటు రంపచోడవరం డివిజన్‌లోని మారెడుమిల్లి, చింతూరు, అడ్డతీగల రాజవొమ్మంగి, వై.రామవరం, లంబసింగి ఘాట్ ప్రాంతాల్లోను వెదురు కొమ్ములకు ఈ సీజన్‌లో మంచి డిమాండ్ ఉంది. అనంతగిరి, లంబసింగి, పాడేరు, సీలేరు, మారెడుమిల్లి, మోతుగూడెం ఘాట్ రోడ్ల వెంబడి కూడా వెదురు వనాలు అధికంగా ఉండడంతో ఆయా మొదళ్ల వద్ద వెదురు కొమ్ములను సేకరిస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించే పర్యాటకులు, పలు వర్గాల ప్రజలు కూడా వెదురు కొమ్ముల వంటకాలకు అలవాటు పడటంతో ఈ సీజన్‌లో వారు కూడా కొనుగోలు చేస్తుంటారు.










