Dec 21,2022 00:07

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌, చిత్రంలో సురేష్‌ తదితరులు

ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని తులసిపాక, సిరసనపల్లి కొండ ప్రాంతాల్లో ఫారెస్ట్‌ అధికారులు స్థానిక ఆదివాసీల చేత వెదురు సేకరించుకొని నేటికీ కూలి డబ్బులు చెల్లించలేదని, తక్షణమే ఇవ్వాలని సిఐటియు రంపచోడవరం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకట్‌, గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్‌ డిమాండ్‌ చేశారు. వెదురును డిపోలకు తరలించి టెండర్ల ద్వారా డబ్బును తమ ఖాతాలో జమ చేసుకున్న అధికారులు నేటికీ గిరిజనులకు కూలి డబ్బులు చెల్లించకపోవడం దారుణమన్నారు. మంగళవారం వారు తులసిపాక గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సాదుల సోమిరెడ్డి, వంజ ముత్తయ్య, ఇరకం బుజ్జి, మడకం భద్రయ్య తదితరులు మాట్లాడుతూ గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ మాసాలలో ఫారెస్ట్‌ అధికారి డిఆర్‌ఓ రాజు, వెదురు సేకరణ చేయాలని, ఒప్పందం ప్రకారం వేతనం చెల్లిస్తానని చెప్పడంతో కొండపైనున్న వెదురును నరికి కిందకు తీసుకొచ్చి డిపోలకు తరలించామని తెలిపారు. నేటికీ కూలి డబ్బులుగాని, కొండపైకి వాహనం వెళ్లడానికి బాట వేసినందుకుగాని డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. ఈ విషయాన్ని అనేక మార్లు ఫారెస్ట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా సిఐటియు, గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ గతేడాది కూలి డబ్బులు చెల్లించకుంటే ఈ ఏడాది వెదురు సేకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మడకం చిన్నయ్య, వంజ ముత్తయ్య, ఇరకం బుజ్జి, ఇరకం సుబ్బయ్య, సాదుల రామిరెడ్డి, ఎరకం ముత్తయ్య, కలముల వెంకయ్య, మడకం భద్రయ్య, తులసిపాక, సిరసనపల్లి వెదురు కార్మికులు పాల్గొన్నారు.