Jun 05,2023 00:04

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-గుంటూరు : ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి జూన్‌ 5 నుంచి 8వ తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌ తెలిపారు. బదిలీలు, ప్రమోషన్ల కౌన్సెలింగ్‌, ఆప్షన్లపై యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయులు ఖాళీల లిస్టులు ముందుగా సేకరించి, కోరుకోవాల్సిన పాఠశాలలను వరుస క్రమంలో గుర్తించుకునే కసరత్తు చేయాలని తెలిపారు. ప్రమోషన్‌ కోరుకొన్న వారి పాఠశాల క్లియర్‌ వేకెన్సీగా చూపుతారని తెలిపారు. ఆప్షన్ల కసరత్తు చేసేటప్పుడు పొరపాటుగా నెట్‌ ఆగిపోయినా అప్పటి వరకూ పెట్టిన పాఠశాలలు సేవ్‌ అవుతాయని పేర్కొన్నారు. ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకున్న తర్వాతే సబ్మిట్‌ చేయాలని సూచించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్‌ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఖాళీలు, వాటి దూరాలు అన్నీ సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. ఎం.కళాధర్‌ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా ఒక యూనిట్‌గా ప్రమోషన్లు, బదిలీలు జరుగుతాయని, 57 మండలాల్లో ఉన్న ఖాళీలను, వాటిపై పూర్తి అవగాహనకు బ్రాడీపేట 2/6లోని యుటిఎఫ్‌ కార్యాలయలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వెబ్‌ ఆప్షన్ల కోసం ఈనెల 5వ తేదీన కార్యాలయంలో ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, సీనియర్‌ నాయకులు కె.విజరు భాస్కర్‌, జిల్లా కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.