* 1436 మందికి రూ.8.76కోట్ల లబ్ధి
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: నూతన వధూవరులకు ఆర్థికంగా చేయూతనందించే లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను అందిస్తోందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 1436 మంది లబ్ధిదారులకు రూ.8.76 కోట్లు లబ్ధి చేకూరుతోందన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణమస్తు, షాదీతోఫా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఆర్ధిక లబ్ధిని లబ్ధిదారుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను నివారించడం, పిల్లల చదువులను ప్రోత్సహించడం, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి ఈ ప్రయోజనం చేకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నాగేంద్ర మీనా, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, కళింగవైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, పొందర కూరాకుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ రాజాపు హైమావతి, డిసిసిబి అధ్యక్షులు కె.రాజేశ్వరరావు, డిఆర్‌డిఎ పీడీ డి.వి.విద్యాసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై.విశ్వమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










