Nov 12,2022 00:32

ఆందోళన చేస్తున్న పెదనాగమయ్యపాలెం వాసులు

సమృద్ధిగా కుళాయి నీరుంటే, ఉప్పునీరు బోర్లు ఎందుకు?
పెద్దనాగమయ్యపాలెం గ్రామస్తుల ఆందోళన
ప్రజాశక్తి -భీమునిపట్నం
: తమ గ్రామంలో తాగునీటి బోర్లు వేయొద్దంటూ మండలంలోని పెద నాగమయ్య పాలెం గ్రామస్తులు శుక్రవారం గ్రామంలోనే ఆందోళన చేశారు. గ్రామ పెద్దలు గరికిన పరశురాం, దూడ ధనంకొండ, పోలయ్య, బడే ఎల్లారావు తదితరులు మాట్లాడుతూ, ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు లేకున్నా, జలజీవన్‌ మిషన్‌ కింద ఎవరి ప్రయోజనాల కోసం బోర్లు వేస్తున్నారని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను ప్రశ్నించారు. బోర్లు వేయడం వల్ల ఉప్పు నీరు వస్తుందని, ఇదే విషయాన్ని గతంలో స్పందనలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అప్పట్లో ఎంపిగా ఉన్న డాక్టర్‌ కె.హరిబాబు తమ గ్రామాన్ని దత్తత తీసుకుని, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటింటికీ అప్పట్లోనే తాగునీటి కుళాయిలు వేశారన్నారు. తాగునీటి అవసరాలు తీర్చాలన్న చిత్తశుద్ధి ఉంటే, తమ పంచాయతీ పరిధిలోని పాతపాలెం, జీరుపాలెం, చిన నాగమయ్య పాలెం గ్రామాల్లో బోర్లు వేయాలని సూచించారు. బోర్లు ఏర్పాటును పెద నాగమయ్యపాలెం గ్రామస్తులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తుంటే, అధికారులు మొండిగా బోర్లు వేస్తామంటూ ముందుకు రావడం సరికాదని మండిపడ్డారు. కార్యక్రమంలో గ్రామస్తులు జి అప్పయ్య తాత, ఎం ప్రసాద్‌, అచ్యుతరావు పాల్గొన్నారు.