May 28,2021 07:47

   అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ సంపద గంటకు 75 కోట్ల రూపాయల చొప్పున పెరుగుతోందన్న వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంటే 'ఔరా!' అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. గతేడాది రూ. 1.64 లక్షల కోట్లగా వున్న అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ ఈ ఏడాది అదే సమయానికి 420 శాతం పెరిగి రూ.8.5 లక్షల కోట్లకు చేరింది. కరోనా విపత్తు వల్ల సాధారణ గృహస్తుల మొదలు సార్వభౌమ ప్రభుత్వాలు సైతం ఆదాయం కోల్పోయి కునారిల్లుతుంటే అదానీకి అలా జరగలేదు సరికదా ఈ కష్ట కాలంలో ఆయన సంపద ఐదు రెట్లు ఎలా పెరిగిందన్న సందేహం ఎవరికైనా కలగడం సహజం. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతుంటే కొద్దిమంది సంపన్నుల వద్ద మాత్రం వందలు, వేల కోట్ల రూపాయలు పోగుబడుతున్న వైనం ఆశ్చర్యం గొలుపుతోంది. భారత సంపన్నుల్లో రెండవ స్థానంలో వున్న గౌతమ్‌ అదానీ సంపద ఏడాది కాలంలో ఐదు రెట్లు పెరిగిందని గత నెల విడుదలైన ఫోర్బ్స్‌ నివేదిక కూడా పేర్కొంది. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, హెచ్‌సిఎల్‌ యజమాని శివ నాడార్‌, కోవిడ్‌ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇండియా అధినేత సైరస్‌ పూనావాలా వగైరా సంపన్నులందరి ఆస్తులూ విపరీతంగా పెరిగాయని ఫోర్బ్స్‌తో సహా అనేక నివేదికలు తేటతెల్లం చేశాయి. కోవిడ్‌ వైరస్‌ వల్ల దేశంలో లక్షలమంది ప్రాణాలు పోయాయి... కోట్లాది కుటుంబాలు కకావికలమయ్యాయి... కానీ ఈ శత, సహస్ర కోటీశ్వరులకు మాత్రం వందల కోట్ల డాలర్లు పోగుబడింది.
   అదానీ సంపద ఇంతలా పెరగడం వెనుక ఆ గ్రూపు మౌలిక వసతుల (ఇన్‌ఫ్రా) రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టడమేనని కార్పొరేట్‌ మీడియా ఊదరగొడుతోంది. నిజానికి గడచిన పదేళ్లుగా ఇన్‌ఫ్రా రంగాలు ముఖ్యంగా నిర్మాణంలో ఉన్నవి భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. వివిధ బ్యాంకుల నుండి ఆయా సంస్థలు తీసుకున్న రుణాలే నిరర్ధక ఆస్తులుగా మారి విత్త సంస్థల్ని దివాలా స్థితికి తెచ్చాయి. అయితే అదానీ గ్రూపు కొత్తవాటి నిర్మాణం కన్నా ఇప్పటికే పని చేస్తున్న పోర్టులు, విమానాశ్రయాలను టేక్‌ ఓవర్‌ చేయడంపైనే - అది షేర్లు కొని లేదా ప్రభుత్వం నుండి పొందడం ద్వారా- కేంద్రీకరించింది. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులను చేజిక్కించుకుంది. ఇక తిరువనంతపురం, అహ్మదాబాద్‌, లక్నో తదితర ఎయిర్‌పోర్టులను భారత ప్రభుత్వమే (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) బిడ్డింగ్‌ పేరిట అదానీ గ్రూపునకు కట్టబెట్టింది. ఈ రెండు రకాల ప్రక్రియల్లోనూ మోడీ సర్కారు, దాని అదుపాజ్ఞల్లో పని చేసే వివిధ వ్యవస్థల తోడ్పాటు అదానీకి పుష్కలంగా లభించిందన్నది జగమెరిగిన సత్యం. చమురు, సహజ వాయువులను హస్తగతం చేసుకోవడం కూడా కమలనాథుల చేదోడుతోనే! ఇక సౌర, పవన విద్యుదుత్పత్తితో పాటు కీలకమైన ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థలను చేజిక్కించుకోవడంలో గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా సహకరించాయన్నదీ కఠోర వాస్తవం. కాబట్టి అదానీ గ్రూపు ఖాతాలోకి వెళ్లిన వివిధ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ప్రజల సంపద. ప్రభుత్వాల మద్దతుతో వాటిని కొల్లగొట్టిందన్నది స్పష్టం. 'వడ్డించేవాడు మన వాడైతే కడ బంతిన కూర్చున్నా...' అన్న సామెత గుర్తుకొస్తుంది కదా! అదే క్రోనీ క్యాపిటలిజం!
    బడా కార్పొరేట్లు ప్రజలందరి ఉమ్మడి సంపదను కాజేస్తున్నారు. ఇలా కొల్లగొట్టడం ప్రభుత్వ ప్రత్యక్ష తోడ్పాటుతో జరుగుతోంది. కాని, దోపిడీకి గురయ్యే అశేష ప్రజానీకం ఈ వాస్తవాన్ని గమనించకుండా వారిని మభ్య పెట్టేందుకు పాలకవర్గ బాకాలు ఇదంతా వారి వ్యాపార సామర్ధ్యంతో సాధించినట్టు చిత్రిస్తుంటాయి. ఈ నయవంచనను కోట్లాది భారతీయులు అర్థం చేసుకోవాలి. బడా కార్పొరేట్ల పట్టపగలు దోపిడీని రూపుమాపేందుకు వారికి వత్తాసుగా నిలిచే పాలకులను సాగనంపేందుకు విశాల ఐక్య ఉద్యమాలే సరైన మార్గం.